ఇసుక వాన

ఇసుక వాననజీబ్‌ కావచ్చు నారాయణ కావచ్చు
ఆకలి వేటగాడి బాణం ములుకులు
తప్పించుకోవడానికి
పచ్చని తరువుల గొడుగులు
చల్లని నదీ ప్రవాహాలు కన్ను తెరిచిన ఊరు
కన్నతల్లికి దూరంగా సాగే వలస పాటలు
దుఃఖ గీతాల పల్లవులు
ఎటు చూసినా ఇసుక అలల సముద్రం
ఇరవైనాలుగు గంటలు వెట్టిచాకిరీ చేసినా
గుక్కెడు నీళ్లు, రొట్టెముక్క విదిలించని
ఇనపగుండెల షేక్‌లు
మనసు బరువు దించుకోవడానికి
ఒంటరితనం ముళ్ళకంపల్ని పెరికి వేయడానికి
మరో మనిషి తోడు లేని
ఎడారిలో జ్ఞాపకాలే ఊపిరి
పగలూ రాత్రీ వారాలూ నెలలూ ఏళ్ళూ
కాల గమనం ఆగిపోయి
చుట్టూ మూగిన గొర్రెల మందలో
తానూ ఒక జంతువైన విషాద వాస్తవం
మాటా పలుకూ మరచి
పెరిగిన వెంట్రుకలే వస్త్రాలై
ఆది మానవుడిగా తిరోగమించిన వేళ
ఆకలి ఒక నరకం వలస ఒక నరకం
భాష కాని భాష దేశం కాని దేశంలో
ఎటు చూసినా ఇసుక మేరువులు
కళ్ళు మూసినా కళ్ళు తెరచినా ఇసుక తుఫాన్లు
చిన్నప్పుడు ఆటల్లో
ఇసుక పడి మంటలు పుట్టిన కళ్ళు
పెద్దయ్యాక ఆకలి బతుకుల్లో
ఆగక కురుస్తున్న ఇసుక వాన
– మందరపు హైమవతి, 9441062732