నేరం రుజువైతే సందీప్‌ ఘోష్‌కు మరణశిక్ష ?

– బెయిల్‌ను తిరస్కరించిన సీబీఐ కోర్టు
కోల్‌కతా : విధుల్లో వున్న జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన ఆర్‌జికార్‌ మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌కు సీబీఐ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఆయనపై నమోదైన అరోపణలు చాలా తీవ్రమైనవి, అత్యంత అరుదైన కేటగిరీలోకి వస్తాయని, అవి రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలు వున్నాయని సీబీఐ కోర్టు అదనపు చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎస్‌. డే వ్యాఖ్యానించారు. ఈ నెల 30వరకు ఘోష్‌ను, సహ నిందితుడు అభిజిత్‌ మోండాల్‌ను జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ చేసిన అభ్యర్ధనను సిబిఐ కోర్టు ఆమోదించింది.
నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసేందుకు సమానత్వపు సూత్రాన్ని నీరుగార్చడం అన్యాయమని కోర్టు అభిప్రాయపడిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో తన క్లయింట్‌ను అన్యాయంగా ఇరికించారని ఘోష్‌ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఈనేరంలో ఆయన పాత్రేమీ లేదన్నారు. అయితే నేరం జరిగిన సమయంలోనిందితుడు అక్కడ వుండాల్సిన అవసరం లేదని, ఇతరుల సాయంతో కూడా ఆ వ్యక్తి నేరానికి పాల్పడవచ్చని వ్యాఖ్యానించారు. అభిజిత మోండాల్‌ బెయిల్‌ విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. సాక్ష్యాధారాలను తారుమారు చేయడమో, ధ్వంసం చేయడమో జరిగింది. అభియోగాలు ఎదుర్కొంటున్న మోండాల్‌ తాళా పోలీసు స్టేషన్‌ మాజీ ఇన్‌చార్జి. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడంలో కావాలనే జాప్యం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.