సీబీఐకి సందేశ్‌ఖలి కేసు విచారణ

కోల్‌కతా: సందేశ్‌ఖలిలో టిఎంసి నాయకుడు షేక్‌ షాజహాన్‌ దురాగతాల కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ నిందితుడు షాజహాన్‌ను మంగళవారం సాయంతం 4:30 గంటల్లోగా సీబీఐ కస్టడీకి అప్పగించాలని కూడా పశ్చిమ బెంగాల్‌ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. నాజత్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 8, 9తోనూ, బంగావ్‌ పోలీస్‌ స్టేషన్‌లోని ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 18లతో ఈ కేసు విచారణను కొనసాగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ శివజ్ఞానంతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం ఆదేశించింది. గతవిచారణలో హైకోర్టు సందేశ్‌ఖలి ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. మంగళవారం ఆ సిట్‌ను రద్దు చేసి, సీబీఐ విచారణకు ఆదేశించింది. షేక్‌ షాజహాన్‌, అతని అనుచరులతో కూడిన కోబ్రా బృందం తమను లైంగికంగా వేధిస్తూ, తమ భూములను ఆక్రమించుకున్నారని సందేశ్‌ఖలిలోని కొంత మంది మహిళలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసింది. జనవరి 5 నుంచి పరారీలో ఉన్న షాజహాన్‌ను ఫిబ్రవరి 29న బెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.