– ఆసియాకప్ మహిళల హాకీ
రాజ్‌గిర్(బీహార్) : మహిళల ఆసియాకప్ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారతజట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ లీగ్ తొలి మ్యాచ్‌లో భారత్ 4-0గోల్స్‌తో మలేషియాపై ఘన విజయం సాధించింది. కెప్టెన్ సలీమా నేతృత్వంలోని భారత జట్టు తొలుత డిఫెన్స్‌కే ప్రాధాన్యతనిచ్చింది. తొలి గోల్‌ను 6వ నిమిషంలో సంగీత కుమారి కొట్టి భారత్‌కు 1-0 ఆధిక్యతలో నిలిపింది. తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఈ అర్ధభాగంలో ఎక్కువ పెనాల్టీ కార్నర్‌లు లభించినా గోల్ చేయడంలో విఫలమైంది. ఇక మూడో క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్ కోసం తీవ్రగా ప్రయత్నించినా.. భారత్ 2గోల్స్ కొట్టగా.. మలేషియా ఆటగాళ్లను భారత మహిళా డిఫెండర్లు సమర్ధవంతంగా నిలువరించారు. మూడో క్వార్టర్‌లో ప్రీతీ దూబే రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచింది. దీంతో మూడో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 3-0గోల్స్ ఆధిక్యతలో నిలిచింది. సంగీత కుమారి నాల్గో క్వార్టర్‌లో ఒక గోల్ కొట్టడంతో భారత్ 4-0తో విజయం సాధించింది. ఈ ఏడాది ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో ఆడిన 16 మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 13 మ్యాచ్‌లలో ఓడింది. అంతేగాక పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించలేదు. దీంతో ఈ ఆసియా కప్‌లో రాణించి మార్గం సుగమనం చేసుకుంది. 14న జరిగే రెండో లీగ్ పోటీలో భారతజట్టు థారులాండ్‌తో తలపడనుంది.