సంఘీర్‌ ‘కామునికంత’ కథలు

మట్టి ముద్రణలు ప్రచురణ సంస్థ 39 వ ప్రచురణగా ఈ కథల సంపుటి ప్రచురించింది. ఈ కథలన్నీ హుమాయున్‌ సంఘీర్‌ పదమూడు సంవత్సరాల సంఘర్షణ ఫలితంగా వచ్చాయి. హిందూ, ముస్లిం జీవితాన్ని కలిపి అర్థం చేసుకునేలా ఈ కథలున్నాయి. గ్రామీణ పల్లె జీవిత విషాదపు గాయం, సలపరం చాలా కథల్లో కనిపిస్తాయి. ప్రముఖ కథారచయిత అల్లం రాజయ్య చక్కటి ముందు మాట రాశారు. పొయ్యిలోకి కట్టెలు ఏరుకొని వచ్చే సాయమ్మ, గుండె నొప్పితో కిందపడి గిలగిలా కొట్టుకుంటుంటే, ట్రాక్టర్‌పై వెళ్లే పాలయ్య ఆమెను చూసి టౌన్‌ దవాఖానాకి తీసుకెళ్లి ప్రాణం కాపాడుతాడు. పట్నంలో పెద్ద దవాఖానాకు భర్త రోషయ్య తీసుకెళతాడు. సాయమ్మ హార్ట్‌ ఆపరేషన్‌ కోసం లక్షలు అవసరమని డాక్టర్‌ చెపుతాడు. ఇంట్లో చాలా దయనీయమైన ఆర్థికపరిస్థితి. వూళ్లో జెగంరెడ్డి అనే పటేలు మృతి, అతని ఖననం తర్వాత, రోషయ్య అతని కొడుకు అర్థరాత్రి శవాన్ని పైకి తీసి, దానిపై బంగారాన్ని తీసుకుని ఇల్లు చేరతారు. ఆ బంగారం అమ్మి భార్య సాయమ్మను బతికించుకోదలుస్తారు. ఇదీ కథాంశం (పేజీ 47). కొడుకు సాంబ పాత్ర కొంచెం ప్రగతిశీలుడుగా చూపిస్తే బాగుండేది. పాఠకుల కంటి తడి పెట్టించే అట్టడుగు సామాన్య కూలీ కుటుంబ విషాదగాథే ‘చిమ్నీ’. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం కథల పోటీలో బహుమతి పొందిన కథ.
ఈ సంపుటికి శీర్షికగా పెట్టిన ‘కామునికంత’ కథ కొంచెం పెద్దదే. దాదాపు ఇరవై పేజీలుంది. మేదరి పని చేస్తూ ఐదెకరాల పొలం గల రైతు దుర్గయ్య, అతని భార్య నర్సవ్వ 4గురు ఆడ పిల్లలకు పెళ్లి చేసి, ఒక్క కొడుకైన చిత్తారికి ఎకరం పొలం మిగుల్చుతాడు. చిత్తారి భార్య లక్ష్మి పట్నంలో కాపురం పెట్టించి వ్యవసాయం నుండి దూరం చేస్తుంది. కరోనాతో ఫ్యాక్టరీలు మూతబడడం, చిత్తారికి తాగుడు, ఖర్చులు పెరగడం, వున్న ఒక్క ఎకరం అమ్మి తల్లిదండ్రులకు తెలియనివ్వడు. భుజంగరావు దుర్గయ్య భూమి కొనడం… బాధపడుతూ నాగలి, బండి, వ్యవసాయ పనిముట్లు కాముని కంతల మంటల్లో వేస్తాడు. ఢిల్లీలో రైతులు జరిపే పోరాటంలో పాల్గొని మంత్రి కొడుకు ట్రాక్టర్‌ను రైతులపై నడపడంతో దుర్గయ్య మరణిస్తాడు. పక్కనున్న మిత్రుడు సాయిల్‌ను దుర్గయ్య రక్షిస్తాడు. కాముని కంత వద్ద తండ్రి విగ్రహం చూసి పశ్చాత్తాపం పడి వ్యవసాయం చేయాలనే ఆలోచనతో ఇల్లు చేరి తల్లి నర్సవ్వను ఓదారుస్తాడు. ‘రంగు, పచ్చచీర, కడసూపు, పరువు’ లాంటి కథలు పాఠకుల్లో ఆర్థ్రత నింపుతాయి. ప్రపంచీకరణ గ్రామీణ వ్యవసాయాన్ని ఎలా దెబ్బతీసిందో చెప్పిన సంఘీర్‌ అభినందనీయులు.