పారిశుధ్య కార్మికులకు ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్‌ కల్పించాలి

– సీఐటీయూ బాలాపూర్‌ మండల అధ్యక్షుడు దాసరి బాబు
నవతెలంగాణ – మీర్‌ పేట్‌
పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ బాలాపూర్‌ మండల అధ్యక్షుడు దాసరి బాబు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనారోగ్యంతో మరణించిన మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పారిశుద్ధ్య కార్మికుడు దుంపల సుధాకర్‌కు ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తుంటే కనీసం ఆరోగ్య బీమా, ఇన్సూరెన్స్‌ సౌకర్యం ప్రభుత్వం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు చనిపోయిన సందర్భంలో దహన సంస్కారాల నిమిత్తం మృతుడి కుటుంబానికి రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ మీర్‌పేట్‌ అధ్యక్షుడు యాదగిరి, జీవన్‌, రంజిత్‌, అంజూర పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.