– 50 బంతుల్లో 107 బాదిన శాంసన్
– రాణించిన తిలక్ వర్మ, సూర్య
– భారత్ స్కోరు 202/8
నవతెలంగాణ-డర్బన్
సంజు శాంసన్ (107, 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లు) శతక నాదంతో గర్జించాడు. డర్బన్‌లో సఫారీ పేసర్లు, స్పిన్నర్లపై విరుచుకుపడిన సంజు శాంసన్ టీ20ల్లో వరుస మ్యాచుల్లో సెంచరీలు సాధించిన ఘనత దక్కించుకున్నాడు. సంజు శాంసన్‌తో సెంచరీతో చెలరేగగా.. తెలుగు తేజం తిలక్ వర్మ (33, 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21, 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సంజు శాంసన్ వన్‌మ్యాన్ షోతో దక్షిణాఫ్రికాతో తొలి టీ20లో భారత్ తొలుత 202/8 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కోయేట్జి (3/37), మార్కో జాన్సెన్ (1/25) రాణించారు.
శతకబాదిన సంజు
టీ20ల్లో వరుస మ్యాచుల్లో శతకాలు బాదిన తొలి బ్యాటర్‌గా సంజు శాంసన్ నిలిచాడు. హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై కెరీర్ తొలి సెంచరీ సాధించిన సంజు శాంసన్.. డర్బన్‌లో ఆ జోరు కొనసాగించాడు. బౌండరీల మోత మోగించి 47 బంతుల్లోనే వంద మార్క్ చేరుకున్నాడు. పీటర్‌పై వరుస సిక్సర్లతో 27 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సంజు శాంసన్.. ఆ తర్వాత టాప్ గేర్‌లో దూసుకెళ్లాడు. తర్వాతి 20 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో వంద మార్క్ అందుకున్న శాంసన్ సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్పిన్, పేస్‌పై అలవోకగా సిక్సర్లు సంధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సంజు శాంసన్‌కు పవర్‌ప్లేలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (21) చక్కటి సహకారం అందించాడు. సూర్య నిష్క్రమించినా, తెలుగు తేజం తిలక్ వర్మ (33) తోడుగా దంచికొట్టాడు. తిలక్ వర్మ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆకట్టుకునే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. స్కోరు వేగం పెంచే క్రమంలో సంజు శాంసన్, తిలక్ వర్మ నిష్క్రమించగా భారత్ జోరు నెమ్మదించింది. హార్దిక్ పాండ్య (2), రింకు సింగ్ (11), అక్షర్ పటేల్ (7) వికెట్‌తో సఫారీ బౌలర్లు డెత్ ఓవర్ల పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. ఆఖరు ఐదు ఓవర్లలో 5 వికెట్లు చేజార్చుకున్న భారత్ 35 పరుగులే చేసింది.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్ : సంజు శాంసన్ (సి) స్టబ్స్ (బి) పీటర్, అభిషేక్ శర్మ (సి) మార్‌క్రామ్ (బి) కోయేట్జి 7, సూర్యకుమార్ యాదవ్ (సి) సిమలానె (బి) క్రూగర్ 21, తిలక్ వర్మ (సి) జాన్సెన్ (బి) మహరాజ్ 33, హార్దిక్ పాండ్య (సి) జాన్సెన్ (బి) కోయేట్జి 2, రింకు సింగ్ (సి) క్లాసెన్ (బి) కోయేట్జి 11, అక్షర్ పటేల్ (సి) స్టబ్స్ (బి) జాన్సెన్ 7, అర్షదీప్ నాటౌట్ 5, రవి (రనౌట్) 1, ఎక్స్‌ట్రాలు :8, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 202.
వికెట్ల పతనం : 1-24, 2-90, 3-167, 4-175, 5-181, 6-194, 7-199, 8-202.
బౌలింగ్ : మార్కో జాన్సెన్ 4-0-24-1, ఎడెన్ మార్‌క్రామ్ 1-0-10-0, కేశవ్ మహరాజ్ 4-0-34-1, గెరాల్డ్ కోయేట్జి 4-0-37-3, పీటర్ 3-0-35-1, క్రూగర్ 2-0-35-1, సిమలానె 2-0-27-0.