సంకల్ప్‌పత్ర్‌ కాదు దేశ ప్రజలకు మరణపత్రం

సంకల్ప్‌పత్ర్‌ కాదు దేశ ప్రజలకు మరణపత్రం– నిత్యావసర ధరలు, నిరుద్యోగం నియంత్రణకు చర్యల్లేవు
– పంటలకు మద్దతు ధర, ఉపాధి కల్పనకు హామీల్లేవు
– జమిలి ఎన్నికలతో రాజ్యాంగ ఫెడరల్‌ వ్యవస్థకు ప్రమాదం : అఖిల భారత వ్యవవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సంకల్ప్‌ పత్ర్‌ పేరుతో బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో దేశ ప్రజలకు మరణపత్రంగా మారే ప్రమాదముందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మోడీ గ్యారెంటీ అంటూ ప్రగల్భాలు పలుకుతూ బీజేపీ నేతలు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, నిరుద్యోగ నియంత్రణకు చర్యలు లేనేలేవన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కల్పన, గ్రామీణ ఉపాధి హామీ చట్టం పనుల విస్తరణ వంటి అంశాల ఊసేలేదని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి చట్టాల అమలు, జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొనడంతో రాజ్యాంగ మనుగడకు, ఫెడరల్‌ వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాజ్యాంగం అమల్లో లేకుంటే వ్యవసాయ కార్మికులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా రిజర్వేషన్లు అమలు ప్రమాదంలో పడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ రక్షణ కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలనీ, వామపక్ష, లౌకిక ప్రజాతంత్ర శక్తులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఐదు కేజీల ఉచిత బియ్యమే కాదు 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించకుండా, ఎఫ్‌సీఐ గోదాములను నిర్వహించే బాధ్యత తీసుకోకుండా ఏ విధంగా ఐదు కేజీల బియ్యం పేదలకు ఇస్తారని ప్రశ్నించారు. కార్మికులు వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల గురించి బీజేపీ పత్రంలో ప్రస్తావన లేదన్నారు. కార్పొరేట్‌ శక్తులకు లాభాలు కలిగించేందుకు కార్పొరేట్‌ కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని, కార్మిక కోడ్‌ లను అమలు చేయడానికి బీజేపీ సిద్ధపడిందని విమర్శించారు. వీరికోసమే బుల్లెట్‌ ట్రైన్‌లను వేస్తామని ప్రకటించింది తప్ప సాధారణ ప్రజల ప్రయాణం చేసే జనరల్‌ బోగీలను పెంచుతామని చెప్పకపోవడం శోచనీయమన్నారు. గ్రామీణ పేదలకు, రైతాంగానికి, కార్మిక వర్గానికి వ్యతిరేక మ్యానిఫెస్టోని విడుదల చేసిన బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్‌, బొప్పని పద్మలు పాల్గొన్నారు.