విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవాలి: సంకశాల మల్లేశ్

నవతెలంగాణ – వేములవాడ రూరల్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషిచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాతవాహన విశ్వవిద్యాలయ  వైస్ ఛాన్సిలర్, ప్రొఫెసర్ సంకశాల మల్లేశ్ పేర్కొన్నారు. శనివారం  అగ్రహారం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల లో కళాశాల పూర్వ విద్యార్ధుల అసోసియేషన్ ఆర్థిక సహాయ సహకారాలతో,  కళాశాల అకాడమిక్ సెల్ ఆధ్వర్యంలో  జరిగిన అకాడమిక్ ఫెస్టివల్, బంగారు పతకాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే నిరంతరం సాధన చేస్తే తప్పక లక్ష్యాలని సాధించవచ్చన్నారు. ప్రతి విద్యార్థి రోజుకు కనీసం ఐదు నుండి ఆరు గంటలు సాధన చేస్తే లక్ష్యాన్ని చేరుకోగలరన్నారు. నేటి యువత టీవీ, సెల్ ఫోన్ , సినిమా వంటి మాధ్యమాలకి బానిసలు కావడం బాధాకరమని, వాటిని  విద్యార్థులు కేవలం తమ విద్య, విజ్ఞానం  వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు.అనంతరం ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు సత్యనారాయణ రెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం తమ వంతు సహాయసహకారాలు అందజేస్తామని  అన్నారు. కళాశాల అభివృద్ధి కోసం, తమ వంతు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు, అనంతరం విద్యార్థులకు గోల్డ్ మెడల్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్, ప్రొఫెసర్లు, పూర్వపు విద్యార్థులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.