సంక్రాంతి బరిలోకి సై..

Sankranti ring..బాలకృష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు ప్రకటించారు. ముందుగా ప్రకటించినట్లుగానే సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘డాకు ఇన్‌ యాక్షన్‌’ పేరుతో చిత్రీకరణ సమయంలోని ఒక ఫొటోని విడుదల చేశారు నిర్మాతలు. ఆ ఫొటోలో దర్శకుడు బాబీ కీలక సన్నివేశం గురించి వివరిస్తుండగా, బాలకృష్ణ శ్రద్ధగా వింటూ కనిపించారు.
బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్‌.థమన్‌ సంగీతం అందిస్తుండగా, విజరు కార్తీక్‌ కన్నన్‌ కెమెరా, కళా దర్శకుడిగా అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌గా నిరంజన్‌ దేవరమానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.