సంక్రాంతి సంబరం

– ఆకట్టుకోనున్న రంగురంగుల రంగవల్లులు
– గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలు
– సంక్రాంతి సందడే సందడి

నవతెలంగాణ కంటేశ్వర్: సంక్రాంతి అందరికీ నూతన క్రాంతి ఇస్తుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది. సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది . ఈ పండుగను రైతులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. సంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గోపూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము.కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరినుండి మొదలై, అనంతరం సింహ, కన్య, తుల, వృశ్చికం, ధనూ రాశులలో కొనసాగినంత కాలము దక్షిణాయణము. మానసికమైన అర్చనకు,ధ్యానానికీ, యోగానికీ, దీక్షలకు,బ్రహ్మచర్యానికి, నియమ నిష్టలకు అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము చెప్పవచ్చును దక్షిణాయణము. పన్నెండు నెలల సంవత్సర కాలములో ఆరు నెలల దక్షిణాయణము దేవతలకు ఒక రాత్రి, ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు. దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్య కాలము. అందువల్లనే ఉత్తరాయణము వరకూ ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తర్వాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు. “సంక్రాంతి” “సంక్రమణం” అంటే చేరుట అని అర్ధం. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో “సంక్రాంతి”ని చక్కగా వివరించారు – తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః – అని తెలిపారు మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతిగా చెప్పవచ్చును సూర్యుని చలనంలో ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలుగా తెలుపవచ్చును.
వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు.మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం గా చెప్పవచ్చును.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు అని చరిత్ర ద్వారా తెలుస్తోంది సంక్రాంతి పండగ రోజు యమున గోదావరి కృష్ణ లాంటి పవిత్ర నదుల్లో పుణ్య స్థానాలు ఆచరిస్తారు. అలా పుణ్య స్థానాలు ఆచరిస్తే పాపాలు కడిగివేయబడతాయని విశ్వసిస్తారు.
సంక్రాంతి పండగ సూర్యుడి మార్పును సూచిస్తుంది. సంక్రాంతి రోజు చేయు దానం పుణ్యప్రదం… సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదిగా చెప్పబడింది. సంక్రాంతి పండుగ రోజున పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. సకినాలు అరిసెలు గారెలు పరమాన్నం మొదలైన పిండి వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. గంగిరెద్దులను ఆడించి ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడ రమణీయంగా ఉంటాయి. అయ్యగారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దు వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో రైతులు ధాన్యాన్ని ఇస్తారు హరిలో రంగ హరి అంటూ హరిదాసుల కీర్తనలు ఆకట్టుకుంటాయి. మహిళలు అందమైన ముగ్గులతో సందడి చేస్తారు. రథం ముగ్గును వేసి ఆకట్టుకుంటారు అందమైన ముగ్గులలో గొబ్బెమ్మలను ఉంచి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహిస్తారు. గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతంగా భావిస్తారు. సంక్రాంతి పండుగ రోజు చుట్టూ పాటలు పాడుతూ నృత్యం చేస్తూ మహిళలు సందడి చేస్తారు. సంక్రాంతి పండగ పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు గాలిపటాలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గడుపుతారు. పిల్లలు పెద్దలు మహిళలు ఇలా అందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.