12 నుంచి బడులకు సంక్రాంతి సెలవులు

12 నుంచి బడులకు సంక్రాంతి సెలవులు– 13 నుంచి జూనియర్‌ కాలేజీలకూ…
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు ఈనెల 12 నుంచి 17 వరకు ఆరురోజులపాటు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. అందుకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌లోనే పాఠశాల విద్యాశాఖ పొందుపరిచింది. డిసెంబర్‌ 22 నుంచి 26 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్‌మస్‌ సెలవులను ఇచ్చింది. దీంతో ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు మిషనరీ స్కూళ్లకు వర్తించబోవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈనెల 13 నుంచి 16 వరకు రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌లో విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈనెల 18న పాఠశాలలు, 17న జూనియర్‌ కాలేజీల్లో తరగతులు పున:ప్రారంభమవుతాయి.