సంక్రాంతి బరిలో ‘గేమ్‌ ఛేంజర్‌’

On the occasion of Sankranti 'Game Changer'రామ్‌ చరణ్‌ కథానాయకుడిగా డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, జీ స్టూడియోస్‌, దిల్‌ రాజు ప్రొడక్షన్‌ బ్యానర్స్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎస్‌వీసీ, ఆదిత్యరామ్‌ మూవీస్‌ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా, హిందీలో ఏఏ ఫిలిమ్స్‌ అనిల్‌ తడాని రిలీజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సోషల్‌ మీడియాను షేక్‌ చేశాయి. ‘జరగండి’, ‘రా మచ్చా’ పాటలు యూట్యూబ్‌లో చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక మరోసారి శ్రోతల్ని, అభిమానుల్ని కట్టి పడేసేందుకు మూడో పాటను రిలీజ్‌ చేయబోతున్నారు. న్యూజిలాండ్‌లో రామ్‌చరణ్‌, కియారా అద్వానీలపై షూట్‌ చేసిన ఈ మెలోడీ గీతాన్ని ఈనెల 28న రిలీజ్‌ చేస్తున్నారు. ఈ అప్డేట్‌ తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో కలర్‌ఫుల్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో రామ్‌చరణ్‌, కియారా ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు.
డిసెంబర్‌ 21న అమెరికాలో చరిష్మా డ్రీమ్స్‌ రాజేష్‌ కల్లెపల్లి ఈచిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను అత్యంత భారీగా నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీజర్‌తో అంచనాలు పెంచిన చిత్రయూనిట్‌ మున్ముందు మరిన్ని ప్రమోషనల్‌ కంటెంట్‌తో ఆడియెన్స్‌ ముందుకు రానుంది. రామ్‌ చరణ్‌ ఈ చిత్రంలో రెండు పవర్‌ఫుల్‌ పాత్రల్లో మెప్పించనున్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ కథ అందించారు. సరిగమ ద్వారా ఈ చిత్ర ఆడియో రిలీజ్‌ అవుతోంది. నార్త్‌ అమెరికాలో ఈ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్‌ భారీ ఎత్తున రిలీజ్‌ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.