సంక్రాంతి పండుగ రానుంది. కొత్త పంటలు ఇంటికి వచ్చిన వేళ సంతోషంతో చేసుకునే ఈ సంక్రాంతికి అల్లుళ్లు ఇంటికి వస్తారు. భోగి నుండి మొదలై నాలుగు రోజుల పాటు ఇల్లు, ఊరు వాడంతా కోలాహలం నెలకొంటుంది. ఆంధ్రాలో అయితే కోడి పందేల జోరు కూడా ఉంటుంది. ఇక పిండి వంటల గురించి చెప్పనవసరం లేదు. మురుకులు, కజ్జికాయలు, అరిసెలు ఇలా చాలా వెరైటీలు చేసుకుంటారు. ఈ వారం మనం కూడా కొన్ని సాంప్రదాయకపు పిండి వంటలు ఎలా చేయాలో చూద్దాం..
కజ్జికాయలు
కావలసిన పదార్థాలు : మైదా – పావు కేజీ, వెన్న – 55 గ్రా. (గది ఉష్ణోగ్రత వద్ద), నీరు – పిండి కలపటానికి సరిపడా, తురిమిన కొబ్బరి – 200 గ్రా., పాలు – 200 ఎం.ఎల్., నెయ్యి – పదిహేను గ్రా. (చెంచా), యాలకులు – ఐదు, చక్కెర – 150 గ్రా.
తయారు చేసే విధానం :
పిండి కోసం : మిక్సింగ్ బౌల్ తీసుకుని మైదా వేయాలి. ఇందులోనే వెన్నను వేసి బాగా కలపాలి. ఇందులోనే కొద్దికొద్దిగా నీళ్ళు చేర్చుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. అయితే పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే కజ్జికాయలు ఉబ్బిపోతాయి. దీనిని గంట పాటు పక్కన పెట్టాలి.
స్టఫింగ్ కోసం : యాలకుల విత్తనాలను మాత్రమే మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేయాలి. నెయ్యి కాగగానే తురిమిన కొబ్బరి వేసి చిన్న మంట మీద కొద్దిగా పొడి అయ్యే వరకు వేయించాలి. అడుగంటకుండా చేసుకోవడం ముఖ్యం. ఇందులోనే పాలు పోసి కలపాలి. కొంచెం దగ్గరయ్యాక చక్కెర కూడా వేయాలి. ఈ మిశ్రమం దగ్గర పడేవరకు కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఒక నిమిషం తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద నుండి దించేసి, గిన్నెలోకి మార్చి, చల్లారనివ్వాలి. నానబెట్టి పక్కన పెట్టుకన్న పిండిని చపాతిలా చిన్న పరిమాణంలో రుద్దుకోవాలి. అందులో తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంచి అంచులను మూసివేయలి. లేదంటే కజ్జికాయల షేప్ బాక్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. చపాతిలా చేసుకున్న పిండిని అందులో పెట్టి, మధ్యలో స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఉంచి, బాక్స్ మూసేస్తే మిశ్రమం పిండిలో సమంగా పరుచుకుంటుంది. తర్వాత అందులో నుంచి తీసేసి అంచులను సరిగా మూసేయాలి. లేదంటే నూనెలో వేపేపుడు విడివడి అందులో కలిసిపోతాయి. ఇలా పిండి మొత్తాన్ని కజ్జికాయల ఆకృతిలో తయారు చేసి పెట్టుకున్నాక, ఒక కడాయిలో నూనె వేసి వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా అందులో వేసి కాల్చుకోవాలి. అంతే నోరూరించే కజ్జికాయలు రెడీ.
చెక్కలు
కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి- పెద్ద కప్పు, పల్లీలు, నువ్వులు- మూడు చెంచాల చొప్పున, కారం – పెద్ద చెంచా, ఉప్పు- తగినంత, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు- చెంచా చొప్పున, కరివేపాకు- రెండు రెమ్మలు, నూనె – వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం : పెద్ద గిన్నెలో బియ్యప్పిండితో సహా అన్ని పదార్థాలను వేసి కొన్ని నీళ్లు పోయాలి. ఇందులోనే ఒక చెంచా నూనె వేడి చేసి కలుపుతున్న పిండిలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గట్టి పిండిలా (పొడిపొడిగా) తడిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. ఈ లోగా కలిపి పెట్టుకున్న పిండికి కాస్త లైట్‌గా నీళ్లు కలిపి అరచేతిలో నూనె రాసి, చిన్న చిన్న అప్పాలుగా చేసుకుని కాగే నూనెలో వేసుకోవాలి. దోరగా వేయించుకుంటే వేడి వేడి చెక్కలు చక్కగా రెడీ అయిపోతాయి.
మురుకులు….
కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి- కప్పున్నర, శెనగపిండి- అర కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, జీలకర్ర- పావు చెంచా, బటర్- పెద్ద చెంచా, కారం – అర చెంచా, ఇంగువ – పావు చెంచా, ఉప్పు- తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారు చేసే విధానం : గిన్నెలో బియ్యప్పిండి, శెనగపిండి, ఉప్పు, జీలకర్ర, ఇంగువ, కారం, బటర్ వేసి చపాతీ పిండిలా తడపాలి. ఈ మిశ్రమాన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి, బాగా కగాక, కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని జంతికల గొట్టంలో వేసి కాగే నూనెలో మురుకుల్లా ఒత్తాలి. వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. పిండి మొత్తాన్ని ఇలా చేసుకోవాలి. అంతే మురుకులు రెడీ.
లడ్డూ
కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి- కప్పు, పుట్నాల పప్పు, పల్లీలు- అర కప్పు చొప్పున, నువ్వులు- రెండు పెద్ద చెంచాలు, ఎండు కొబ్బరి తురుము- పావు కప్పు, యాలకుల పొడి – పావు చెంచా, బెల్లం – కప్పు, నెయ్యి – రెండు పెద్ద చెంచాలు, నీళ్లు- తగినన్ని
తయారు చేసే విధానం : పల్లీలు, పుట్నాలు, నువ్వులు, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి అన్నింటిని విడివిడిగా వేయించి పెట్టుకోవాలి. పల్లీలు, పుట్నాలను పొడి చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో బియ్యప్పిండి పుట్నాల పప్పు పొడి, పల్లీల పొడి, నువ్వులు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. నెయ్యి కూడా జత చేసి ఉండలు లేకుండా మరోసారి కలుపుకోవాలి. స్టవ్ మీద మందపాటి బాండీ పెట్టి కప్పు బెల్లం వేసి, పావు కప్పు నీళ్లు పోసి చిన్న -మంటపై నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రెండు, మూడు నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవాన్ని వడకట్టి పిండిలో పోసి బాగా కలియబెట్టాలి. చేతులకు నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలా చేసుకోవాలి. అంతే రుచికరమైన లడ్డూలు రెడీ.
అరిసెలు
కావలసిన పదార్థాలు : బియ్యం – 600 గ్రా., బెల్లం – 300 గ్రా., నీరు – 40 లేదా 50 మి.లీ., యాలకుల పొడి – చెంచా, నువ్వులు – ఒకటి లేదా రెండు చెంచాలు, నెయ్యి – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
తయారు చేసే విధానం : బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయే వరకు ఉండాలి. బియ్యాన్ని కొద్ది కొద్దిగా చిన్న మిక్సి జార్‌లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని పిండి జల్లెడతో జల్లించాలి. ఇలా చేస్తే మెత్తని పిండి వేరవుతుంది. మిగిలిన పొడిని మళ్లీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇలా చేస్తే పిండి మెత్తగా ఉంటుంది. పిండి పొడిబారకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి.
బెల్లం పాకం కోసం : ఒక పెద్ద గిన్నెలో బెల్లం తరుము వేసి పొయ్యి మీద పెట్టాలి. అందులో నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ హై ఫ్లేమ్‌లో ఉంచి కలుపుకుంటూ మరిగించాలి. అడుగంటకుండా జాగ్రత్త వహించాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకునేందుకు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. బెల్లం మిశ్రమాన్ని కలిపేపుడు గరిటతో కలుపుతూ పరిశీలించుకోవాలి. కొద్ది సేపటికి ఈ మిశ్రమం తీగలా సాగడం మొదలవుతుంది. నీళ్లు పోసి పెట్టుకున్న గిన్నెలో ఈ పాకం వేస్తే అది కరిగి పోకుండా ఉన్నప్పుడు పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క లేదంటే పాకం నీళ్లలో వేసి ఆ పాకాన్ని చేతిలో తీసుకుంటే ఉండలా అవుతుంటే పాకం వచ్చినట్లే. వెంటనే స్టవ్‌ను సిమ్‌లో పెట్టుకుని నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ కట్టేసి పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆలస్యం చేయకుండా జల్లెడ పట్టి పక్కన పెట్టుకున్న పిండిని అందులో పిడికిళ్లతో కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. అది చపాతీ పిండిలా గట్టిగా తయారయ్యే వరకు బియ్యం పిండి వేసి కలుపుతూ ఉండాలి.
అరిసెలు చేయుటకు : పెద్ద మందపాటి కడాయిలో మీడియం సెగ మీద నూనెని వేడి చేయాలి. నూనె వేడయ్యేలోగా చేతికి కొంచెం నూనె రాసుకుని పిండి తీసుకుని గుండ్రటి ముద్దలా చేసుకుని కవర్ మీద పెట్టి అప్పలా ఒత్తుకోవాలి. దీని మీద కొన్ని నువ్వులు అద్ది మెల్లగా నూనెలోకి జారవిడవాలి. నూనెలో వేయగానే అది మునిగి పోతుంది. కాబట్టి అది పైకి తేలే వరకు కడపకుండా ఆగాలి. పైకి తేలాక ఒక నిమిషం ఆగి అప్పుడు మెల్లగా రెండో వైపుకి తిప్పాలి. రెండు వైపులా తిప్పుతూ సమంగా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. నూనెలో నుండి బయటకి తీశాక రెండు గరిటెల మధ్యన ఉంచి నూనె మొత్తం కారిపోయే వరకు గట్టిగా ఒత్తాలి. వీటిని ఒక పట్ట మీద పరుచుని చల్లారిన తర్వాత డబ్బాలో ఎత్తిపెట్టుకోవాలి. ఇవి నెల పాటు నిల్వ ఉంటాయి.