నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో ఇక నుండి ప్రతి సోమవారం సంత జరుగుతుందని మండల ఎంపీడీవో మరియు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ జవహర్ రెడ్డి అన్నారు. శనివారం పంచాయతీ కార్యాలయంలో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ప్రతి సోమవారం గ్రామంలో సంత జరుగుతూ ఉండేది. జాతీయ రహదారి అభివృద్ధి కారణంగా సంతను నిలిపివేయవలసి వచ్చింది. ఇప్పుడు అంగడి నిర్వహణ కోసం గెస్ట్ హౌస్ ప్రాంతంలో వినియోగదారులకు మరియు వ్యాపారులకు అనుకూలంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ అంగడిని ప్రజలు మరియు వ్యాపారులు సమన్వయంతో వినియోగించుకోవాలని సూచించారు. ముందు ముందు అంగడి అభివృద్ధికి పంచాయతీ ద్వారా మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి భారతి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అంగడి నిర్వహణలో ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా చెప్పి సొంత అభివృద్ధి కోసం అందరం కలిసి కృషి చేద్దామని అన్నారు.