– ఆటోను ఢకొీట్టిన డీసీఎం
– ఆరుగురు తండావాసుల మృతి
– జాతీయ రహదారిపై స్థానికుల ధర్నా..డీసీఎం దహనం
– మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఘటన
నవతెలంగాణ – బాలానగర్
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తండావాసులతో వెళ్తున్న ఆటోను డీసీఎం ఢకొీట్టింది. సంతలో కూరగాయలు, నిత్యావసర వస్తువులు కొనుక్కుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు డీసీఎంను తగలబెట్టారు. రోడ్డుపై బైటాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..
బాలానగర్‌లో వారాంతపు సంతకు చుట్టుపక్కల తండాల నుంచి ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయల కోసం వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం పలువురు తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. బాలానగర్ బస్టాండ్ కూడలి సమీపంలో ఆటో రోడ్డు క్రాస్ చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన డీసీఎం ఢకొీట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలకు చెల్లాచెదురుగా పడిపోయాయి. అదే సమయంలో ఆటో బైక్‌పై పడటంతో.. పలువురికి గాయాలయ్యాయి. మృతులు మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్ తండావాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఈ ఘటనతో 44వ జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కాగా మృతుల బంధువులు, స్థానికులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. సంత జరిగే రోజు ట్రాఫిక్ నిర్వహణ సరిగా చేయలేదంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన డీసీఎంకు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్యే దిగ్భ్రాంతి..
బాలానగర్ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం విషయం తెలిసి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు సూచించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.