అదో అద్భుత ప్రాంగణం..
మీకు ఇష్టమైన రంగం వెతుక్కోవడమే ఆలస్యం
అందంగా ముస్తాబైన వేదిక
రారమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది
అక్కడ కవిత్వం ఏరులై పారుతుంది
ఉపన్యాసాల వర్షం కురుస్తుంది
మేధావుల చర్చలు రసవత్తరంగా నడుస్తాయి
పుస్తకాలు పురుడు పోసుకొని పుట్టుకొస్తాయి
మధ్యమధ్య నత్యాలు కనువిందు చేస్తాయి
కాగితాల రెపరెపలు పొత్తాల పరిమళం
ఆవరణమంతా వ్యాపించి ఉంటుంది
ఎన్నడూ చూడని కొత్త కాంతులు
వికసిత వెలుగు రేఖలు వెల్లివిరుస్తాయి
అలమారల్లో కుక్కిపడున్న కట్టలు
ఎప్పుడు ఈ నెల వస్తుందాని ఎదురు చూస్తుంటాయి
బయట ప్రపంచపు గాలి పీల్చుకొని
పక్క స్టాల్ నేస్తాలను పలకరించేందుకు తహతహలాడుతుంటాయి
పెళ్లి చూపుల కోసం ముస్తాబైనట్టుగా
ఒక్కో పుస్తకం సిద్ధమవుతుంది
పుస్తకాల్ని కన్నవారు కుర్చీ వేసుక్కూర్చుంటారు
ఒక్కొక్కరుగా గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉంటారు
తిరగ మరగా పేజీలు తిప్పుతుంటారొకరు
కళ్లద్దాలు సరిచేసుకొని చదివేసే ప్రయత్నం ఒకరిది
అక్షరాలు పెద్దవా చిన్నవా ఎగేసి చూసేదొకరు
బొమ్మలు ఉన్నాయా లేదా పరికిస్తుందో బుడ్డది
ఇంతకీ ఇందులో ఏముంటది అడుగుతాడో అమాయకుడు
డిస్కౌంట్ ఉందో లేదోనని డిస్కవరీ చేస్తారు ఒకరు
చిందర వందర చేసేసి కాలక్షేపం కబుర్లాడేది ఒకరు
వచ్చే పోయే వారి మధ్య
పుట్టెడు దుమ్ము నేనున్నానంటూ ఎగిసిపడుతుంది
సభలు సమావేశాలు ఎక్కే దిగే వేడుకలు సందడి చేస్తుంటాయి
పలకరింపులు, పరామర్శలు బోలెడన్ని!
సెల్ఫీలు గ్రూప్ ఫోటోలు లెక్కలేనన్ని
ఈసారైనా నాలుగు పుస్తకాలు చెల్లుబాటు అవుతాయా
తపన ఆవేదన మరికొందరిది
పెన్ను పట్టుకు రాయడమే తప్ప
బజ్జీలమ్మే బాబాయిలా
స్టూలుపై కూర్చొని అమ్మడం తెలియని తన్నులాట!
అందరిని కలవాలని ఆరాటం
ఎవరిని కలిసిన ఆగని ఉత్సాహం పోటీపడుతుంటాయి
విద్యార్థుల కోలాహలం రచయితల సమాగమం
అక్షరాలన్నీ కలగలిసి చేసే కష్టసుఖాల కలబోత !
పుస్తక ప్రియులకు కనుల పండుగైన విజ్ఞానపు సంత
కులమత ప్రాంతాలకు అతీతంగా
తమకు కావలసిన పెన్నిధి కోసం చేసే వెతుకులాట !
పుస్తకాలు కొంటూ పకోడీలు తింటూ
టీ కాఫీలతో సేదతీరుతూ
కలుసుకున్న స్నేహ పరిమళాలతో గడిపే
అపురూప అమూల్య సమయం
అందుకున్న వారికి అందుకున్నంత
గుండెలనిండా నింపుకున్న వారికి నింపుకున్నంత!
– డా. సమ్మెట విజయ