– తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్ డ్రా
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రతిష్టాత్మక దేశవాళీ సీనియర్ నేషనల్ సంతోష్ ట్రోఫీ 57 ఏండ్ల సుదీర్ఘ విరామం అనంతరం హైదరాబాద్‌కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 37 జట్లు పోటీపడుతున్న ఫుట్‌బాల్ టోర్నీ శనివారం హైదరాబాద్‌లోని డెక్కన్ ఎరీనాలో ఘనంగా ఆరంభమైంది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్) చైర్మన్ కే. శివసేనా రెడ్డి, శాట్ వీసీ ఎండీ సోనీ బాలాదేవిలు సంతోష్ ట్రోఫీ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన శివసేనా రెడ్డి క్రీడాకారులతో కరచాలనం చేశారు. ఫుట్‌బాల్‌తో పాటు ఇతర క్రీడల అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. సంతోష్ ట్రోఫీలో పోటీపడుతున్న జట్లకు శివసేనా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం జరిగిన తెలంగాణ, రాజస్థాన్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. మణిపూర్, సర్వీసెస్ మ్యాచ్‌లో మణిపూర్ 1-0తో విజయం సాధించింది.