సారంగో సారంగా…

Sarango Saranga...పాటంటే ఎలా ఉండాలి?, ఆకాశంలో మబ్బులా కనపడాలి. చూస్తుంటే గుండె ఉప్పొంగి పోతుండాలి. ఇక్కడ ఆకాశం వేరు, మబ్బు వేరు కాదు. అలాగే కథ వేరు, పాట వేరు కాదు. కథలో పాట ఓ అంతర్భాగంలా ఉండాలి. పాత్రల తాలూకు, సన్నివేశం తాలూకు అంతరంగాన్ని పాట ఒడిసిపట్టగలగాలి. అలాంటిదే మా ‘సారంగపాణి జాతకం’ చిత్రంలోని ‘సారంగో సారంగా’ పాట అని దర్శకుడు మోహనకష్ణ ఇంద్రగంటి అన్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూపా కొడువాయుర్‌ జంటగా నటించారు. ‘జెంటిల్మన్‌’, ‘సమ్మోహనం’ తరువాత శ్రీదేవి మూవీస్‌ – మోహనకష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. డిసెంబర్‌ 20న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది. ఇందులో మొదటి పాట ‘సారంగో సారంగా’ని ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా సోషల్‌ మీడియాలో శనివారం విడుదల చేశారు. విడుదలైన కాసేపట్లోనే వీక్షకులని, శ్రోతల్ని అమితంగా ఆకట్టుకోవడంతో నిర్మాత శివలెంక కష్ణప్రసాద్‌ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో కథానాయకుడు ప్రియదర్శి పేరు సారంగపాణి. అతని ప్రేమకథ నేపథ్యంలో వచ్చే పాట ఇది. ఈ పాట అర్మాన్‌ మాలిక్‌ గళంలో, రామజోగయ్య శాస్త్రి పద చాతుర్యం కొత్త పుంతలు తొక్కినట్టుగా అనిపిస్తుంది. వివేక్‌ సాగర్‌ హాయైన స్వరాలతో ఈ పాటని తీర్చిదిద్దారు. ఇక సినిమాలో సరికొత్త ప్రియదర్శిని చూడబోతున్నారు’ అని చెప్పారు.