సారథి సూర్య!

Surya!– సూర్యకు టీ20 జట్టు పగ్గాలు
– వన్డే, టీ20ల్లో వైస్‌ కెప్టెన్‌ గిల్‌
– వన్డే జట్టులో రోహిత్‌, విరాట్‌ కోహ్లి
– శ్రీలంక పర్యటనకు భారత జట్ల ఎంపిక
సెలక్షన్‌ కమిటీ ఊహించిన నిర్ణయమే తీసుకుంది. టీమ్‌ ఇండియా టీ20 ఫార్మాట్‌ పగ్గాలు అనూహ్యంగా సూర్యకుమార్‌ యాదవ్‌కు దక్కాయి. ఫిట్‌నెస్‌, పని భారం పరిగణనలోకి తీసుకుని హార్దిక్‌ పాండ్యను నాయకత్వ బృందం నుంచి తప్పించింది. టీ20 ప్రపంచకప్‌ విజయం సాధించిన జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్‌ పాండ్య.. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో నాయకత్వ బాధ్యతలకు దూరమయ్యాడు. భారత జట్టు భవిష్యత్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌కు సెలక్షన్‌ కమిటీ ఓటేసింది. వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో వన్డే, టీ20 జట్లకు శుభ్‌మన్‌ గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. పొట్టి ప్రపంచకప్‌ విజయాన్ని ఆస్వాదిస్తున్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి లంకేయులతో వన్డే సిరీస్‌కు రానున్నారు. భారత్‌, శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌ ఆగస్టు 27న తొలి టీ20తో ఆరంభం కానుంది.
నవతెలంగాణ-ముంబయి
ఉత్కంఠ వీడింది. సస్పెన్స్‌కు తెరపడింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ విజయంతో రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకగా.. ఆ ఫార్మాట్‌లో నయా నాయకుడిని బీసీసీఐ ఆల్‌ ఇండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ గురువారం ఎంపిక చేసింది. పొట్టి ఫార్మాట్‌ సూపర్‌ స్టార్‌, మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్‌ గైర్హాజరీలో కెప్టెన్‌గా, టీ20 ప్రపంచకప్‌లో వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యను అజిత్‌ అగర్కార్‌ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీ పక్కనపెట్టింది. యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ భారత వైట్‌బాల్‌ ఫార్మాట్‌ జట్లకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. శ్రీలంక పర్యటనలో భారత టీ20, వన్డే జట్లకు వైస్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ ఎంపికయ్యాడు. గురువారం ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన సెలక్షన్‌ కమిటీ శ్రీలంక పర్యటనకు భారత జట్లను ఎంపిక చేసింది. ఈ మేరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది.
సూర్యకు తొలి సవాల్‌
సూర్యకుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ కొత్త కాదు. దేశవాళీ సర్క్యూట్‌లో ముంబయి రంజీ జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించాడు. భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్‌ను ముందుండి నడిపించాడు. కానీ 2026 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ రోడ్‌మ్యాప్‌ దిశగా సెలక్షన్‌ కమిటీ ఓ అడుగు ముందుకేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌కు ఈ ఫార్మాట్‌ సారథ్య పగ్గాలు అప్పగించింది. శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌తో సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ ప్రయాణం ప్రారంభించనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో వైస్‌ కెప్టెన్‌గా నిలిచిన హార్దిక్‌ పాండ్యకు సారథ్య పగ్గాలు దక్కటం లాంఛనమే అనుకున్నారు. కానీ ఇటీవల హార్దిక్‌ పాండ్య గాయాలు సెలక్షన్‌ కమిటీ ఆలోచనలను మార్చివేసింది. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు సైతం హార్దిక్‌ పాండ్య గాయంతో దూరమయ్యాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ నేపథ్యంలో పాండ్య పని భారంపై సెలక్షన్‌ కమిటీ దృష్టి నిలిపింది. ఈ నేపథ్యంలోనే పాండ్యకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వలేదని సమాచారం.
భవిష్యత్‌ అతడే
అజిత్‌ అగార్కర్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు సారథ్యం వహించిన రుతురాజ్‌ గైక్వాడ్‌ను కాదని.. జింబాబ్వే పర్యటన పగ్గాలు శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించింది. తాజాగా శ్రీలంక పర్యటనకు సైతం శుభ్‌మన్‌ గిల్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. భవిష్యత్‌ను గమనంలో ఉంచుకుని శుభ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్సీ అప్పగించింది. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ కోసం శుభ్‌మన్‌ గిల్‌ను సారథ్య బాధ్యతలకు సిద్ధం చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఇటీవల జింబాబ్వే పర్యటనలో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో సాధించిన శుభ్‌మన్‌ గిల్‌.. సెలక్షన్‌ కమిటీని ఆకట్టుకున్నాడు.
ఆ ఇద్దరు వస్తున్నారు
సీనియర్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడనున్నారు. టీ20 ప్రపంచకప్‌ విజయం అనంతరం ఆ ఫార్మాట్‌కు గుడ్‌ బై పలికిన దిగ్గజ క్రికెటర్లు.. ద్వైపాక్షిక సిరీస్‌తో చాంపియన్స్‌ ట్రోఫీ వేటకు సన్నద్ధం కానున్నారు. వాస్తవానికి గతంలో చిన్న జట్లతో ద్వైపాక్షిక సిరీస్‌లకు స్టార్‌ క్రికెటర్లు దూరంగా ఉండేవారు. యువ క్రికెటర్లను ఆ సిరీస్‌ల్లో ఆడించేవారు. కీలక ఆటగాళ్లకు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విశ్రాంతి ఇవ్వటంపై గౌతం గంభీర్‌ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ బరిలోకి దిగుతున్నారని చెప్పవచ్చు. ఇక టీమ్‌ ఇండియా చీఫ్‌ కోచ్‌గా నియమితులైన గౌతం గంభీర్‌కు సైతం శ్రీలంక పర్యటనలో తొలి పరీక్ష ఎదురు కానుంది. ఐపీఎల్‌ 2024 టైటిల్‌ విజయంతో ఊపుమీదున్న గంభీర్‌కు భారత జట్టు బాధ్యతలు సరికొత్త పరీక్ష పెట్టనున్నాయి. గంభీర్‌ తనదైన శైలిలో జట్టును నడిపించేందుకు శ్రీలంక పర్యటనతోనే షురూ చేయనున్నాడు. ఇక బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయిన శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి భారత జట్టులోకి రావటం గమనార్హం.

భారత టీ20 జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, రింకూ సింగ్‌, రియాన్‌ పరాగ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోరు, అర్షదీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌.
భారత వన్డే జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రియాన్‌ పరాగ్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రానా, శివం దూబె, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, మహ్మద్‌ సిరాజ్‌.