సర్ఫరాజ్‌ అజేయ ద్వి శతకం

Sarfaraz's unbeaten double century– ముంబయి తొలి ఇన్నింగ్స్‌ 536/9
లక్నో: ఇరానీ కప్‌లో యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (221 నాటౌట్‌, 276 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. భారత టెస్టు జట్టుకు ఎంపికైనా.. తుది జట్టులో అవకాశం రాకపోవటంతో బెంచ్‌కు పరిమితమైన సర్ఫరాజ్‌ ఆ జోరు ఇరానీ కప్‌లో రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లపై చూపిస్తున్నాడు. కెప్టెన్‌ అజింక్య రహానె (97), శ్రేయస్‌ అయ్యర్‌ (57), తనుశ్‌ కోటియన్‌ (64) అర్థ సెంచరీలతో రాణించారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగిన సర్ఫరాజ్‌ ఖాన్‌ బౌండరీల మోత మోగించాడు. 149 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ కొట్టిన సర్ఫరాజ్‌.. 253 బంతుల్లో ద్వి శతకం నమోదు చేశాడు. సర్ఫరాజ్‌ మెరుపులతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 138 ఓవర్లలో 536/9 పరుగులు చేసింది. రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. యశ్‌ దయాల్‌, ప్రసిద్‌ కష్ణలు రెండేసి వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.