ఐక్య పోరాటానికి తలొంచిన సర్కార్‌

Sarkar decided to fight unitedly– అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి హామీ
– 24 రోజుల సమ్మె ఫలితం
–  మాట తప్పితే మరో ఉద్యమం తప్పదు : అంగన్‌వాడీ జేఏసీ హెచ్చరిక
– సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటన
-‘చలో హైదరాబాద్‌’ అందోళన విజయవంతం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంగన్‌వాడీల ఐక్య పోరాటానికి సర్కారు తలొంచింది. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కొంత సమయం కావాలని అభ్యర్థించింది. గతంలో మాదిరి నమ్మించి మోసం చేసే చర్యలకు పాల్పడితే, ఈసారి సహించేది లేదని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌తో పాటు ఇతర అంశాలపై గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవరించి, మళ్లీ కొత్త ఉత్తర్వులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో 24 రోజుల నుంచి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు జేఏసీ నేతలు ప్రకటించారు. అయితే పోరాటానికి ఇది తాత్కాలిక విరామమేననీ, ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే భవిష్యత్‌ ఐక్య ఉద్యమాలకు అందరూ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (సీఐటీయూ-ఏఐటీయూసీ) బుధవారం ‘చలో హైదరాబాద్‌’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అయితే రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిమంది అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తరలివచ్చారు. దీనితో ధర్నా శిబిరాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు మార్చారు. అయితే అంతకుముందు జేఏసీ నేతల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు, ఐసీడీఎస్‌ మంత్రి సత్యవతిరాథోడ్‌తో పాటు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. జేఏసీ తరఫున అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ)/ అసోసియేషన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీత, పీ జయలక్ష్మి / సాయి ఈశ్వరి, ఎన్‌ కరుణకుమారి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య, భూపాల్‌, రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌డీ యూసుఫ్‌, కార్యదర్శులు సమ్మయ్య, సీతా మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రులతో జేఏసీ నేతలు చర్చించారు. గతంలో ఇలాగే చర్చలకు ఆహ్వానించి, ఇచ్చిన హామీలకు భిన్నంగా ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన అంశాన్ని జేఏసీ నేతలు ప్రస్తావించారు. అయితే ఈసారి అలా జరగదని ఆర్ధికమంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అంగన్‌వాడీ ఆయాలకు రూ.లక్ష, టీచర్లకు రూ.2 లక్షలు చెల్లిస్తామనీ, 65 ఏండ్లలోపు రిటైరయ్యే అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు వీఆర్‌ఎస్‌ వర్తింప చేస్తామనీ, తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన ఐదు శాతం ఐఆర్‌ను అందరికీ వర్తింపచేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. దానితో పాటు సమ్మెకాలపు వేతనాన్ని కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదబీమా గురించి ఐసీడీఎస్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌తో చర్చించి, వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా ప్రయత్నిస్తామంటూ స్పష్టమైన హామీలు ఇచ్చారు. మరికొన్ని సమస్యల పరిష్కారానికి కొంత గడువు కావాలని అభ్యర్థించారు. దీనికి జేఏసీ నేతలు సానుకూలంగా స్పందించారు. అనంతరం సుందరయ్య పార్కు వద్ద జరిగిన భారీ బహిరంగసభలో జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడారు. మంత్రులతో జరిగిన చర్చల సారాంశాన్ని వివరించారు. 24 రోజలు సమ్మె, అనంతర విజయాలను వారికి వివరించారు. సంఘటిత శక్తితో సాధించలేనిది ఏదీ లేదంటూ వారిలో ఉత్తేజాన్ని నింపారు. సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శ్రామిక మహిళ సమన్వయ కమిటీ (సీఐటీయూ) కన్వీనర్‌ ఎస్‌ రమ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే ఈశ్వరరావు, కార్యదర్శి టీ వీరారెడ్డి, ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బీవీ విజయలక్ష్మి పాల్గొన్నారు.