– హైదరాబాద్ ప్రజలకు తీపికబురు
– ప్రాజెక్ట్ కోసం రూ.5,560 కోట్లు కేటాయింపు
– ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లరు ఫేజ్-2కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగల్ ఇచ్చింది. భవిష్యత్‌లో హైదరాబాద్ మహా నగర తాగునీటి అవసరాలను మరింత మెరుగు పర్చేందుకు ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిశోర్ జీవో ఆర్టీ నెంబర్ 345 జారీ చేశారు. గోదావరి రెండో దశ పనులకు రూ.5,560 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ నగరానికి అదనపు జలాలను తరలించడంతో పాటు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల్ని పునరుజ్జీవం చేస్తూ, హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో పనులు పూర్తి చేయనున్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వివిధ మార్గాల ద్వారా 580 ఎంజీడీల నుంచి 600 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు. 2030 సంవత్సరం వరకు నీటి అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని 170 ఎంజీడీల అదనపు జలాల్ని సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరి నది నుంచి మొత్తం 30 టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండటంతో, అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు ఫేజ్-2ను చేపట్టాలని నిర్ణయించారు.
2030 సంవత్సరం నాటికి హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 750 ఎంజీడీలకు పెరుగుతుందనీ,. 2050 నాటికి ఈ డిమాండ్ 1,014 ఎంజీడీలుగా ఉంటుందని అంచనా వేశారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లరు పథకం ఫేజ్-1 ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. ఈ 15 టీఎంసీల్లో.. 10 టీఎంసీలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం కాగా, మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన 5 టీఎంసీలను ఉపయోగిస్తారు. దీని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను వ్యాప్‌కోస్ కంపెనీ రూపొందించింది. దీనిలో పంప్‌హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, మల్లన్న సాగర్ నుంచి ఘన్‌పూర్ వరకు 3,600 ఎమ్‌ఎమ్ వ్యాసార్థంతో భారీ పైప్‌లైన్ నిర్మించనున్నారు. ఘన్‌పూర్, శామీర్‌పేట్ వద్ద 780 ఎంఎల్‌డీల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఘన్‌పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణం చేపడతారు. రెండేండ్ల్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం గోదావరి ఫేజ్-1 ద్వారా 163 ఎంజీడీల నీరు సరఫరా అవుతుంది.