సర్కారువారి నోట ఒకటే పాట..! ముందు ప్రధాని, తరువాత స్పీకర్, ఆపైన రాష్ట్రపతి… అందరి నోటా ‘ఎమర్జెన్సీ’ మాటే! పార్లమెంటు ప్రారంభమై స్పీకర్ ఎన్నికైన రోజు… ఎప్పుడో నలభైతొమ్మిదేళ్ల క్రితం ఎమర్జెన్సీ విధించిన రోజు ఒకటే కావడం యాదృచ్ఛికమో లేక వ్యూహాత్మకమో తెలియదుగానీ, అధికారపక్షం దానినొక అందివచ్చిన అవకాశంగా వాడుకుంటున్నది. గడిచిన పదేండ్లూ నెహ్రూనే లక్ష్యంగా చేసుకుని విమర్శలతో పబ్బం గడిపారు. ఇప్పుడు ఇందిర వంతు కాబోలు… ప్రమాణస్వీకారాల రోజే ఎమర్జెన్సీపై విమర్శలు మొదలు పెట్టారు. ”ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి, పౌరహక్కులను కాలరాసిన సమాజం ఎలా ఉంటుందో, నియంతృత్వం ఎంతటి ప్రమాదకరమైందో నేటితరం తెలుసుకోవడానికి ఎమర్జెన్సీ ఒక ఉదాహరణ” అంటూ ప్రధాని ప్రవచిస్తుంటే సభాపతితోపాటు ప్రభుత్వ పెద్దలంతా ‘ఫాలో’ అవుతున్నారు. నిజానికి దేశచరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమనడంలో సందేహమే లేదు. కానీ, అంతకు మించిన నియంత పోకడలు పోయేవారికి ఎదుటివారి నియంతృత్వాన్ని విమర్శించే అర్హత ఉంటుందా?
గడిచిన పదేండ్ల పాలనాకాలమంతా వీరు మాత్రం చేసిందేమిటి? ఇదే సభాపతి గత సభలో ఏకపక్షంగా ఒకేసారి 146మందిని బహిష్కరించిన అప్రజాస్వామిక చర్యలను మరిచిపోగలమా? పార్లమెంటులో ప్రతిపక్షాన్ని లేకుండా చేసి కీలకమైన బిల్లులన్నిటినీ(లోక్‌సభలో 18బిల్లులు, రాజ్యసభలో 17బిల్లులు) ఏకపక్షంగా ఆమోదింప జేసుకోవడాన్ని విస్మరించగలమా? వీరి ప్రభుత్వం అనుసరించిన అరాచక, అనైతిక ధోరణులకు, అణచివేతల పర్వానికీ అర్థమేమిటీ? అత్యవసర పరిస్థితి అంటూ చట్టబద్ధమైన ప్రకటనేమీ చేయకుండానే అన్ని రకాల స్వేచ్ఛలను హరించారు. వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. మీడియాను భయపెట్టి లోబరుచుకున్నారు. పత్రికాస్వేచ్ఛను చెరబట్టారు. పార్టీలను నిట్టనిలువునా చీల్చారు. ప్రత్యర్ధులను జైళ్లకు పంపారు. ప్రజాపోరాటాలూ ఆందోళనలపై పాశవికమైన దాడులకు పాల్పడ్డారు. తమతో ఏకీభవించని గొంతులపై నిర్దాక్షిణ్యంగా ఉక్కుపాదం మోపారు. ఎమర్జెన్సీని విధించకుండానే ఎన్ని నిర్బంధాలకు పాల్పడవచ్చో, ఎంతటి కక్షసాధింపులు సాగించవచ్చో ప్రజలకు కండ్లారా చూపించారు. అలాంటి వారు నియంతృత్వం గురించి, రాజ్యాంగ నియమాల గురించి, ప్రజాతంత్ర హక్కుల గురించి మాట్లాడటం గురివింద నీతినే తలపిస్తోంది.
అయినా ఉన్నట్టుండి అంత బిగ్గరగా ఏళ్లనాటి ఎమర్జెన్సీ అంశాన్ని ”ఇప్పుడు” ఎందుకు లేవనెత్తుతున్నారు. తమ నుంచి రాజ్యాంగానికి ప్రమాదముందని చెపుతున్న ప్రతిపక్షాల దాడి నుండి ఆత్మరక్షణకా? పదేండ్ల తరువాత ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన కాంగ్రెస్‌పై ఎదురుదాడికా? లేక తమ నిర్వాకంలో వెలుగుజూస్తున్న అవినీతి అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికా? పౌరసమాజం ఆలోచించాలి. ఒకవైపు పరీక్షా పత్రాల లీకేజీలు, వాటి నిర్వాహణలో అవకతవకలూ అక్రమాలతో లక్షలాది యువత భవిత ప్రశ్నార్థకమవుతుండగా దేశమంతా ఆందోళనలతో అట్టుడుకుతోంది. మరోవైపు ఆగని రైలు ప్రమాదాలూ ఉగ్రదాడులకు తోడు పెరిగిన ధరలూ, తరిగిన ఉపాధి అవకాశాల వంటి దైనందిన సమస్యలతో ప్రజాజీవితం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటి గురించిన కనీస ప్రస్తావన లేకుండా ఎమర్జెన్సీని ఎత్తిచూపడం ప్రజలను ఏమార్చడమే అవుతుంది.
ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు చట్టసభల్లో ప్రతిబింబిస్తేనే పార్లమెంటరీ వ్యవస్థలు చిరకాలం మనగలుగుతాయి. ప్రజల బాగుకోసం ప్రభుత్వమూ ప్రతిపక్షమూ కలిసి నడుస్తూ చట్టసభల ప్రతిష్టను కాపాడుకోవాలి. కానీ, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్నదేమిటి? ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా పాలకపక్షం తీరు మారలేదు. అదే అహంకారం. అదే ఏకపక్ష వైఖరి. అదే దాటవేత ధోరణి. బహుశా ప్రజాతీర్పు నుంచి పాఠాలు నేర్చుకోవడానికి వారు సిద్ధంగా లేనట్టున్నారు. సాధారణంగా అధికారపక్షానికి చెందిన వారిని స్పీకర్‌గా, ప్రతిపక్ష సభ్యుడిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే అందుకు అంగీకరిం చేందుకు అధికారపక్షం సంసిద్ధత చూపలేదు. ఫలితంగా ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికకు పోటీ అనివార్యమైంది. ప్రొటెం స్పీకర్ ఎంపిక విషయంలోనూ పాలకపక్షం ఇదే తీరును ప్రదర్శించింది. ఎనిమిదిసార్లు గెలిచి సభలో అత్యంత సీనియర్‌గా ఉన్న విపక్ష సభ్యుడిని కాదని, సొంతపార్టీ ఎంపీని ఎంపిక చేసింది. తద్వారా సభా సంప్రదాయాలనూ తుంగలో తొక్కింది. దీనిని కప్పిపుచ్చుకోవడం కూడా ఈ ఎమర్జెన్సీ రాగాలాపనలో ఓ భాగమే కావొచ్చు..
అయితే ప్రతిపక్షమేమీ చేష్టలుడిగి లేదు. ప్రజలిచ్చిన బలంతో తన పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. స్పీకర్‌గా అధికారపక్ష అభ్యర్థే నెగ్గవచ్చుగాక… కానీ, ఓడిపోతామని తెలిసీ పోటీచేయడం ద్వారా ప్రతిపక్షం ఒక స్పష్టమైన సందేశాన్నివ్వడంలో విజయం సాధించింది. ఇకపై ఏదీ ఏకపక్షం కాబోదని హెచ్చరించింది. 16, 17వ లోక్‌సభలా 18వ లోక్‌సభ ఉండబోదని నిరూపించింది. ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని సభకు పంపారని గుర్తుచేసింది. అయితే తమ అమోఘమైన ”నరేంద్ర జాలం”తో ఎమర్జెన్సీ రాగాలాపన చేసి, ఇవన్నీ ప్రజల గమనంలోంచి తప్పించామని ఏలినవారు భావిస్తే… అది పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన చందమే అవుతుంది.