బదిలీలతో సరోజినీ ఆస్పత్రి పరేషాన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బదిలీలు ప్రభుత్వాస్పత్రుల సేవలపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో బదిలీ అయినవారు వెళ్లిపోగా అక్కడ చేరాల్సిన వారు రాకపోవడంతో రోగులకు అందే సేవలకు విఘాతం కలుగుతున్నాయని తెలుస్తున్నది. హైదరాబాద్‌లోని సరోజినీదేవి కంటి ఆస్పత్రి ప్రభుత్వాధ్వర్యంలో నడిచే ఏకైక పెద్ద ఆస్పత్రి. బదిలీల్లో భాగంగా ఈ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.రాజలింగంతో సహా ఐదుగురు ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్స్‌ ప్రొఫెసర్లు, 11 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఫార్మసిస్ట్‌, ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు, సిస్టర్స్‌, హెల్త్‌ ఇన్స్పెక్టర్‌, గ్లకోమా అండ్‌ కార్నియాకు సంబంధించిన సిబ్బంది బదిలీపై వెళ్లిపోయారు. అయితే సరోజినీ ఆస్పత్రికి బదిలీపై రావాల్సిన వారంతా వచ్చి చేరకపోవడంతో బుధవారం ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ఆస్పత్రికి రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రోగులు పెద్ద ఎత్తున వస్తుంటారు. బదిలీల ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రోగులు ఇక్కట్ల బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు.