సర్పంచ్‌ ఎన్నికలొస్తున్నారు

సర్పంచ్‌ ఎన్నికలొస్తున్నారు– నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు
– ప్రిసైడింగ్‌, పోలింగ్‌ సిబ్బంది డేటా పంపాలని ఆదేశం
– 30లోపు వివరాలివ్వాలని సర్క్యులర్‌ జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసి వారం కాకముందే రాష్ట్రం గ్రామపంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. జనవరిలో సర్పంచ్‌ ఎన్నికల నగారా మోగనున్నది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధింత కసరత్తు ప్రారంభించింది. వార్డుల వారీగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, ప్రిసైడింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారుల నియమాకం తదితర వివరాలను ఈ నెల 30వ తేదీలోపు పోలింగ్‌ పర్సనల్‌ ర్యాండమైజేషన్‌ సిస్టమ్‌ (పీపీఆర్‌)లోని టీపోల్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం కార్యదర్శి ఎమ్‌.అశోక్‌ కుమార్‌ ఒక సర్క్యులర్‌ను జారీ చేశారు. ఆ కాపీని పంచాయతీరాజ్‌ శాఖ జిల్లా అధికారులకు, డిప్యూటీ కలెక్టర్లకు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎన్నికల అథారిటీ డైరెక్టర్‌, ఎమ్‌పీడీఓ, అసిస్టెంట్‌ డీఈఏలకు పంపారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మూడు దశల్లో నిర్వహించే ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశముంది.
పంచాయతీరాజ్‌ యాక్టు 243(3)(ఎ) ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతి ఐదేండ్లకోసారి జరపాలి. తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీలకు వాటి పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించాలి. 2019 జనవరిలో తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ఫిబ్రవరి 1, 2024తో ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కసరత్తును మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన పనులు ప్రారంభించాలని కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ సిబ్బందికి ఎంపిక, నియామకానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. సిబ్బంది నియామకం, పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, తదితర అంశాలపై కీలకమైన సూచనలను చేసింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకూ ఒక పోలింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. వార్డులో 200 మంది ఓటర్లుంటే ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారిని నియమించాలని పేర్కొంది. వార్డులో 201-400 వరకు ఓటర్లుంటే ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 ఓట్లుంటే ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలీంగ్‌ అధికారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకుగానూ అవసరమైన దానికంటే 20 శాతం సిబ్బందిని అదనంగా నియమించాలని స్పష్టం చేసింది. వీలైనంతమేరకు గెజిటెడ్‌ అధికారులనే ప్రిసైడింగ్‌ అధికారులుగా ఎంపిక చేయాలని కోరింది. అర్హతగల పోలింగ్‌ సిబ్బంది డేటాను టీపోల్‌లో నమోదు చేయాలని సూచించింది. పేరు, లింగం, హోదా, సంప్రదించాల్సిన చిరునామా, కార్యాలయం, వేతనం, పోస్ట్‌ స్కేలు, పనిస్థలం తదితర అంశాలను టీపోల్‌ సాఫ్ట్‌వేర్‌లో పొందుపర్చాలని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన మార్గదర్శకాలనూ పొందుపర్చింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో అందుబాటులో ఉన్న ఉద్యోగుల డేటాను కూడా వాడుకోవచ్చునని సూచించింది. ప్రతి జిల్లాలోనూ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. ఈ డేటాను 30వ తేదీ లోపు టీపోల్‌లో నమోదు చేయాలని నొక్కిచెప్పింది.