
నవతెలంగాణ – మల్హర్ రావు
దేశాభివృద్ధికి గ్రామాలే పట్టుకొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే.. రాష్ట్రం.. దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. ఆ అభివృద్ధిని ముందుకు నడిపించే రధసారధులైన సర్పంచులు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మరో 10 రోజుల్లో తెలంగాణ సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఐదేళ్ల కాలంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు సర్పంచులు. దానికి లక్షల్లో బిల్లులు అయ్యాయి. ఇప్పుడు ఆ బిల్లులు అన్నీ పెండింగ్‌లో పడ్డాయి. సర్పంచులకు పదవి నుంచి దిగిపోయే చివరి క్షణంలోనూ ఆ పెండింగ్ బిల్లులు రాకపోవడంతో.. ఆందోళనలో పడ్డారు. ఫిబ్రవరి మొదటివారంతో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. ఐదేళ్ల కాలంలో అభివృద్ధి పనులకు ఖర్చుచేసిన బిల్లులు లక్షల్లో పెండింగ్ లో ఉండడంతో పదవికాలం దగ్గర పడుతున్న కొద్దీ.. వారిలో టెంక్షన్ మొదలైంది. రావలసిన బిల్లుల కోసం ఎదురుచూస్తూ ఆందోళన, అయోమయంలో పడ్డారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను జనాభా ప్రతిపాదికన వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏడాదిన్నరగా అతీగతీ లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులే గ్రామ పంచాయతీలకు దిక్కుగా నిలిచాయి. ఆ నిధులు సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోతు గ్రామాల్లో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్, మురుగు కాల్వల శుభ్రం, వీధిలైట్లు, వాటర్ పైపుల లీకేజీలు, రోడ్ల శుభ్రతకు సరిపోతున్నాయి.దీంతో పాటు గ్రామాల్లో సిసి రోడ్ల తోపాటు అనేక అభివృద్ధి పనులకు సొంత డబ్బులతో పాటు.. బయటినుంచి లక్షల్లో అప్పులు తెచ్చి పనులు చేశారు. ఇప్పుడు పదవీకాలం దగ్గర పడుతున్నకొద్దీ కొందరిలో ఆందోళన ఎక్కువతుంది. వడ్డీకి తెచ్చి గ్రామాభివృద్ధి కోసం పాటుపడితే బిల్లులు రాకపోవడంతో.. పలు ప్రాంతాల్లో పలువురు సర్పంచులు తనువులు చాలించారు.గతేడాది బిల్లుల కోసం సర్పంచులు పట్టుబట్టగా అసెంబ్లీ ఎన్నికలు రావడం.. వెంటనే ఎన్నికల కోడ్ విధించడటంతో.. బిల్లులకు బ్రేక్ పడింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో సర్పంచ్లకు ఏంచేయాలో అర్ధం కావడం లేదు. మెజార్టీ పంచాయతీల సర్పంచులు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోతున్నారు. ప్రభుత్వమే.. సహృదయంతో.. సర్పంచ్ ల పట్ల చొరవచూపి పెండింగ్ బిల్లులను విడుదల చెయ్యాలని కోరుతున్నారు.