– బీసీ వెల్పేర్ కమిషనర్ బాల మాయదేవి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తరతరాలకు స్ఫూర్తి సర్వాయి పాపన్న అని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయదేవి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సంక్షేమభవన్‌లో పాపన్న వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన సర్వాయి పాపన్న చరిత్ర ఎంతో గొప్పదని ఆమె కొనియాడారు. తెలంగాణ నాయకుడైన పాపన్న చరిత్ర దేశవిదేశాల్లో అక్షరీకరించారన్నారు. విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సర్దార్ పాపన్న శాశ్వత శిలావిగ్రహం ఏర్పాటు చేయడం ఆయన ప్రజల కోసం చేసిన పోరాటానికి నిదర్శనమని ఆమె ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బి. సైదులు, ఎంబీసీ సీఇవో అలోక్ కుమార్ , బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్, ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.