రాచరికపు వ్యవస్థ నీడలో అగ్రకుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, జమీందార్లు, జాగీర్దారుల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడు పాపన్న. ఖిలాషాపూర్‌ను కేంద్రంగా చేసుకొని మొఘలుల ఆధిపత్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన పోరాటయోధుడు. కుల,మత, జాతి వర్గ విభేదాలు లేని సమాజం కోసం 350 ఏండ్ల కిందనే కృషి చేసిన నాయకుడు. ఆధిపత్య, అగ్రకుల పాలకులు బహు జనులను అణగదొక్కుతున్న 17వ శతాబ్దంలోనే స్వీయ సైన్యంతో దక్కన్‌పై బహుజన రాజ్య స్థాపన చేసిన తొలి బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మహాత్మా జ్యోతిరావు పూలేకంటే ముందే సామాజిక న్యాయం అమలు చేసిన గొప్ప సామాజిక విప్లవకారుడు.’చరిత్ర చదవనివారు చరిత్ర నిర్మాతలు కాలేరు’ అన్నట్లుగా మహనీయుల జీవిత చరిత్రలను నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధూళిమిట్ట శాసనం ప్రకారం పాపన్న ఉమ్మడి వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్‌లో 1650 ఆగష్టు 18 జన్మించాడు. బాల్యంలో పశువుల కాపరిగా నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్ధితులు స్నేహితులతో చర్చించేవాడు. చిన్నతనం నుంచే ఆధిపత్య బ్రాహ్మణ భావజాల వ్యతిరేక బీజాలు పాపన్నలో ఏర్పడ్డాయి.నిత్యం పూజలు చేసే సంప్రదాయాలను యుక్త వయసు వచ్చే నాటికి క్రమక్రమంగా వ్యతిరేకించాడు.బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కల్పిస్తాని కులవృత్తి చేయనని తల్లితో ప్రతిజ్ఞ చేసాడు.పాపన్న ఎక్కువగా ఇతర కులాల వారితో కలిసి తిరిగేవాడు.వీరిలో చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్లు, దూదేకుల పీరు, కొత్వాల్ మీరు సాహేబ్ పాపన్న ప్రధాన అనుచరులు.వీరందరూ బహుజనులే.
తెలంగాణాలో మొగల్ రాజుల ఆధిపత్యాన్ని అంతం చేయాలని, తాబేదారులు, జమీనుదారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలను గమనించి బానిసత్వ విముక్తి కల్పించాలని గోల్కొండ కోటపై బహుజనుల జెండా ఎగురవేయాలని నిర్ణయించాడు.పాపన్నకు ఎలాంటి వారసత్వ నాయకత్వం, ధనం, అధికారం కాని లేవు.12వేల మందితో గెరిల్లా సైన్యాన్ని,3వేల మందితో పదాతి దళాలు,500 మందితో రక్షకదళాలను ఏర్పాటు చేసుకున్నాడు. దళిత, గిరిజనులను చేరదీసి వారికి యుద్ధవిద్యలను నేర్పాడు. మొగలు సైన్యంపై తన సైన్యంతో దాడి చేసి తన సొంత ఊరు ఖిలాషాపూర్‌ని రాజధానిగా చేసుకొని 1675లో సర్వాయి పేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు.
ఛత్రపతి శివాజీకి సమకాలికుడు పాపన్న. శివాజీ ముస్లింల పాలన అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో మొగలుల పాలన అంతానికి పోరాడారు. 1687-1724 వరకు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు. సర్వాయిపేట కోటతో మొదలుపెట్టి పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు,కోటలు(21) వరకు నిర్మించాడు. 1678 వరకు తాటికొండ, వేములకొండలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. కనుచూపు మేరలో శత్రువులను కనిపెట్టెలా కోటలు నిర్మించాడని చరిత్రకారులు చెబుతారు. ఆధునిక ఆయుధాలు ఉపయోగించినట్లు చారిత్రక ఆనవాళ్లు లభించాయి.కోటకు నాలుగు వైపులా బురుజులు, మధ్యలో ఎత్తైన మరో బురుజు, ఒక బురుజు నుంచి మరో బురుజు వైపు నడిచి వెళ్లేందుకు సరిపడా వెడల్పయిన స్థలం, శత్రువులను ఎదుర్కొనేందుకు వీలుగా కోట గోడపై పిట్ట గోడలకు అనువైన రంధ్రాలు ఉండటంతో పాటు ఈ కోట నుంచి బయటకు వెళ్లేందుకు మూడు సొరంగాలున్నాయి. కోటలను శత్రువులకు అంతుచిక్కకుండా నిర్మించాడు.
తెలంగాణలో మొగలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్నది సర్వాయి పాపన్నే. అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి నాటి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, హుజూరాబాద్ వరకు విస్తరించింది. పాపన్న ముస్లిం మతానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె భువనగిరి కోట ఫౌజ్దార్ (మిలిటరీ గవర్నర్) సోదరి. సామాన్య వ్యక్తి శత్రుదుర్భేద్యమైన కోటలను వశపర్చుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. పాపన్న ఆలోచనలకు బెంబేలెత్తిన భూస్వాములు, మొగలాయి తొత్తులైన నిజాములు, కుట్రలు పన్ని సైన్యాన్ని బలహీనపర్చారు. 1700-1705 మధ్యకాలంలో ఖిలాషాపురంలో మరొక దుర్గం నిర్మించాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు గోల్కొండ కోటను స్వాధీనపర్చుకొని ఏడు నెలలపాటు అధికారం చెలాయించాడు. మొగలురాజు బహుదార్ షా పాపన్న పరాక్రమాన్ని గుర్తించి గోల్కొండ ప్రభువుగా ప్రకటించాడు.
ఒక సామాన్య గీత కార్మికుడు గోల్కొండ ప్రభువుగా ఉండటం గిట్టని అగ్రకుల ఆధిపత్య వర్గాలు ఢిల్లీ బహుదూర్ షాు పాపన్నపై అసత్య ప్రచారాలు చేశారు. ఆ విషయాలు నమ్మిన ఢిల్లీ బహదూర్ షా పాపన్న సైన్యంపై దాడి చేసి ఆరు నెలలు పోరాడినట్లు చరిత్ర. యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే(1710) ఓ రోజు రాత్రి పాపన్న ఉద్యమద్రోహి చేత పట్టుపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత పాపన్నను ఉరి తీసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి తలను ఢిల్లీకి పంపారని చరిత్రకారులు రిచర్డ్స్, హనుమంతరావులు తెలిపారు. పాపన్న ప్రయత్నాన్ని ద్వంద్వ తిరుగుబాటుగా వారు అభివర్ణించారు. మొగలు ప్రభువుల అరాచకాలకు మత చాందస విధానాలకు వ్యతిరేకంగా ఇరవైయేండ్లు బహుజన రాజ్య విస్తరణకు(ఓరుగల్లు నుండి గోల్కొండ వరకు) కృషి చేసాడు పాపన్న.
బహుజనుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డ తొలి బహుజన రాజు పాపన్న చరిత్రను అగ్రవర్ణ చరిత్రకారులు వక్రీకరించారు. ఆధిపత్యాన్ని ఎదిరించి, బానిసత్వాన్ని ధిక్కరించిన సర్వాయి పాపన్నను దోపిడీ దొంగగా చిత్రీకరించారు. పిచ్చుకకుంట్ల వాళ్లు, దాసరి కాండ్రవాళ్ళు, వీరముష్టి వాళ్లు పాపన్న చరిత్రను వీరగాథలుగా ఊరూరా తిరిగి చెప్పేవారు.జానపద కళారూపాల ద్వారా పాపన్న చరిత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించాయి.పాపన్న చరిత్రను ఆంగ్లేయ కవి జే.యే.బోయేల్ ఇండియన్ అంటిక్వెరి పత్రికలో 1874లోనే రాశారు. పాపన్న వీరత్వానికి గుర్తుగా లండన్ మ్యూజియంలో విగ్రహాన్ని పొందుపరిచారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్‌బుక్‌లో పాపన్న గురించి రాసారు. చరిత్రను పరిశోధించి తెలుగు యూనివర్సిటీ మాజీ వీసీ, కీర్తిశేషులు ఆచార్య పేర్వారం జగన్నాథం, పీహెచ్‌డీ తీసుకుని పాపన్న తెలంగాణ ప్రాంతంలోని ఖిలాషాపురానికి చెందినవాడని రుజువు చేశారు. ప్రముఖ కవులు మల్లంపల్లి సోమశేఖర్‌శర్మ, ఆదిరాజు వీరభద్రరావు, చోల్లేటి నృసింహశర్మ రామరాజులు పాపన్న చరిత్రను వెలుగులోకి తెచ్చారు. పాపన్న గౌడ్ జీవిత చరిత్రను కొంపల్లి వెంకటేష్ గౌడ్ రాసారు. బిఎస్‌ఎల్ హన్మంతరావు తాను రాసిన ఆంధ్రుల చరిత్రలో పాపన్న వీరత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని కొనియాడారు.
అలనాటి అగ్రవర్ణ ఆధిపత్య చరిత్రకారులు, నాటి ఆంధ్ర పాలకులు పాపన్న చరిత్రను వక్రీకరించి ప్రపంచానికి తెలియకుండా తొక్కిపెట్టారు. తెలంగాణకు చెందిన పోరాట యోధులు సర్దార్ సర్వాయి పాపన్న, చాకలి ఐల్మ, కొమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.జనగామ జిల్లా ఖిలాసాపూర్‌లో 17వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కట వారసత్వాన్ని కాపాడడం, పూర్వవైభవ పునరుద్ధరణ, సాంస్కృతిక పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి.బహుజనులు ఐక్యమై రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తామని ప్రతిన పునాలి.అప్పుడే పాపన్న ఆశయ సాధనలో సఫలీకృతం అయినట్టు.
(18 ఆగస్టు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి)
– పాకాల శంకర్ గౌడ్, 9848377734