సర్వం జగత్ స్మార్ట్ ఫోన్ మయం

– ఎన్నికల్లో స్మార్ట్ వర్క్ చేస్తున్న.. స్మార్ట్ ఫోన్
– గల్లి నుండి ఢిల్లీ ముచ్చట్లు అరచేతిలో
– సాఫ్ట్ వేర్ నుండి పశువుల కాపరి వరకు అందుబాటులో సమాచారం
– ఓటరన్న నాడి పట్టడంలో నాయకుల విఫలం..
– ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్…
– కనిపించని కరపత్రాలు, వాగ్దానాల గోడపత్రికలు
నవతెలంగాణ – రాయపర్తి
ఎన్నికల సమరశకం మోగిందంటేనే కరపత్రాల పంపిణీ, వాగ్దానాల గోడపత్రికలు ఎక్కడ చూసినా కనిపిస్తుండేది.. ఇంటింటి ప్రచారంతో కార్యకర్తలు, నాయకుల హడావిడి ఉండేది.. కానీ కాలం మారింది..! ఎన్నికల ప్రచార సగం వంతు స్మార్ట్ ఫోనులోనే స్మార్టుగా జరుగుతుంది దాంతో సర్వం జగత్ స్మార్ట్ ఫోన్ మయం అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ నాయకులు ఓటరన్న నాడి పట్టడంలో విఫలమవుతున్నారని స్పష్టంగా కనిపిస్తుంది.  ఎన్నికల రాజకీయ వేడి మొత్తం సామజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. పంచ్‌లు, కార్టూన్లు, స్పూఫ్‌ వీడియోలు, సర్వేలు, సవాళ్లు.. ఇలా ఎంతో సృజన నిండిన కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఈ కంటెంట్‌ను షేర్ చేస్తున్నారు. ప్రధానంగా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే దీని లక్ష్యమని నాయకులు అనుకుంటున్నారు. కానీ ఓటర్లు ఎలాంటి కంటెంట్ చేసి ఓటు వేస్తారు అనేది అంచనా వేయడం అతి క్లిష్టమైన పరిస్థితే అనుకోవచ్చు.. గల్లి నుండి ఢిల్లీ వరకు ప్రతి ముచ్చట స్పష్టంగా స్మార్ట్ ఫోనులో క్షణక్షణం చూస్తుండడంతో మండలం, నియోజకవర్గ రాజకీయ విషయమే కాదు రాష్ట్ర, దేశ రాజకీయాలపై కూడా సామాన్యులకు అవగాహన ఉంది. దాంతో స్మార్ట్ ఫోన్ పట్టిన ఓటర్లు పైకి ఏ జెండా పట్టిన వారికి ఉన్న నీగూడమైన సమాచారంతో ఎవరికి ఓటు వేస్తారనేది రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఫోన్ లతో సమాచారం ఇవ్వడం మాత్రమే జరిగేది కానీ వర్తమాన కాలంలో టెక్నాలజీ పెరగడంతో సినిమా థియేటర్లో చూడవలసిన 70 ఎంఎం సినిమా అరచేతిలో చూస్తున్నారు. ఏసి రూములో కూర్చునే సాఫ్ట్ వేర్ మొదలు అడవిలో పశువులను కాచే కాపరి వరకు ప్రతి రాజకీయ విషయాన్ని క్షుణ్ణంగా అరచేతిలోని ఫోనులో 70 ఎంఎం క్లారిటీతో పరిశీలిస్తున్నారు చివరికి ఏ నాయకుడికి ఏ సినిమా చూపిస్తారో తెలియడం లేదు దానికి ముఖ్య కారణం స్మార్ట్ ఫోన్..! గతంలో ఓటర్లు నాయకుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి.. పాలన సామర్థ్యాన్ని బట్టి.. సహాయ నీయత బట్టి ఓటు వేసేవారు నేడు పరిస్థితి పూర్తిగా ఉల్టా ఫాల్తాగా మారింది.  గెలుపు ఓటములు నిర్ణయించే ఎన్నికల సర్వే  తీరు పూర్తిగా మారింది. జనాల దగ్గరికి వెళ్లి మాట్లాడే అవసరం లేదు, వారి మనసులో ఉన్న మాటను తెలుసుకునే అవసరం అస్సలు లేదు. సోషల్ మాధ్యమాల్లో ఒక్క పోస్ట్ చేస్తే చాలు క్షణాల్లో ఎంతమంది ఏ నాయకుడికి ముగ్గు చూపుతున్నారు ఏ నాయకుడి పై ఎలాంటి అభిప్రాయం ఉందో స్పష్టంగా తెలుస్తోంది. దీనిలో మరో తిరకాసు ఉంది ఈరోజు సోషల్ మాధ్యమాల్లో ఒక అభిప్రాయాన్ని తెలిపిన వ్యక్తి మరుసటి రోజు అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు దాంతో సోషల్ మాధ్యమాల వ్యూహకర్తలకు కూడా ఓటరన్నల మస్తిష్కంలో ఏముందో అర్థం కావడం లేదు. ఏదేమైనాప్పటికీ ఈ ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలను మార్చడంలో స్మార్ట్ ఫోన్ పాత్ర కీలకం కాబోతోంది..