– కాంగ్రెస్ టికెట్లపై కొనసాగుతున్న ఉత్కంఠ
– పొత్తులు..ఎత్తులపై చర్చోపచర్చలు
– కీలకంగా మారనున్న కమ్యూనిస్టులు
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుపై ‘సర్వే’త్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కార్యక్రర్తల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్టానం ఉద్దేశపూర్వకంగానే టికెట్ల కేటాయింపులో జాప్యం చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు, షర్మిల పార్టీ విలీనం… ఈ రెండింటి పై స్పష్టత వస్తే ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు పూర్తవుతుందని ఆ పార్టీ రాష్ట్రస్థాయి కీలక నేతలు కొందరు చెబుతున్నారు.
ఆశావహుల్లో టెన్షన్..
అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ సమీపిస్తున్నా కొద్దీ వెయ్యికి పైగా ఉన్న కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.ఈ నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదల అవుతుందని వార్తలు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంచనా వేసినా అది సాధ్యమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ఖరారైతే అదే రోజు లేదా మరుసటి రోజు మొదటి జాబితా ప్రకటన ఉంటుందని పీసీసీ నేతలు ఆశావహులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 30 నియోజకవర్గాలకు ఒకే దరఖాస్తు రావడంతో వీరి అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మరో 30 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ ముప్పై నియోజకవర్గాల్లో టికెట్ల కోసం గట్టి పోటీ ఉండడంతో మరొకసారి సర్వేలు నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని అనుకున్నా అదీ జరగలేదు. ఈ వారంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారైన వెంటనే, స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి జాబితాకు దాదాపు 70 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
27 నియోజకవర్గాల్లో రీ సర్వేలు..
సూర్యాపేట, జనగామ, ఖైౖరతాబాద్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ, భువనగిరి తదితర 27 నియోజకవర్గాలల్లో రీ సర్వేలు చేసినట్టు సమాచారం. గెలుపే లక్ష్యంగా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడం పార్టీ గెలుపుపై ప్రభావం తీవ్రంగా చూపినట్టు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అందుకే ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్నప్పటికీ అవకాశాలు కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని ఎక్కడీ ఎలా? అడ్జస్ట్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహాలు..
వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. మొదటినుంచి ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా కాంగ్రెస్ పైనే ఉంది. కాబట్టి ప్రభావితం చేయగల భావ సారూప్య పార్టీలతో ఆ పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ వారంలో ఈ చర్చలు కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో కమ్యూనిస్టు పార్టీలు కీలకంగా మారనున్నాయి. కాబట్టి ఆ పార్టీల నేతలతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు కూడా ఫలప్రదమైనట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా కచ్చితంగా వెలువడే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. కమ్యూనిస్టులతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎవరి పేర్లు ఉంటాయనేదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ప్రత్యర్థి బీఆర్ ఎస్ అధినేత అభ్యర్థులను ప్రకటించి ఇప్పటికే నెల రోజులకు పైగా అవుతున్న దష్ట్యా కాంగ్రెస్ పార్టీ జాబితా ఎలా ఉండబోతుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. భారీగా దరఖాస్తుదారులు ఉన్న నియోజకవర్గాలు, కీలక నేతలు పోటీపడుతున్న స్థానాలపైనే అందరి దృష్టి కేంద్రీకతమై ఉంది.