ప్రధాని మోడీ, ఆయన పార్టీ బీజేపీ వల్లె వేస్తున్న ‘వికసిత భారత్’ లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లి మెంటేషన్ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్)తో బహిర్గతమైంది. సదరు అధ్యయనం ప్రకారం దేశంలో 15 ఏళ్లు, అంత కంటే ఎక్కువ వయసు కలిగిన గ్రాడ్యుయేట్లలో 13.4 శాతం మంది నిరుద్యోగంలో మగ్గుతున్నారు. దేశంలోకెల్లా అత్యల్ప నిరుద్యోగిత రేటు చండీగఢ్‌లో 5.6 శాతం కాగా ఢిల్లీలో 5.7 శాతం. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా 33 శాతం నిరుద్యోగిత ఉంది. ఈ సర్వే ఫీల్డ్ వర్క్ జూన్ 2022 నుంచి జులై 2023 మధ్య జరిగింది. పదేళ్ల మోడీ ఏలుబడిలో దేశం నిరుద్యోగ భార తాన్ని ఆవిష్కరించిందనడానికి ఇంతకంటే వేరే సాక్ష్యా ధారాలు అవసరం లేదు. ఈ కాలంలో నిరుద్యోగ సమస్య ఆందో ళనకర స్థాయికి చేరుతోందని పలు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. కార్పొరేట్ దిగ్గజాల్లో ఒకరైన అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం ఈ మధ్య విడుదల చేసిన సర్వే మేరకు దేశంలో 25 ఏళ్లలోపు గ్రాడ్యుయేట్లలో 42.3 శాతం నిరుద్యోగులేనని తేల్చింది. ఉన్నత మాధ్యమిక విద్య పూర్తి చేసిన వారిలో 21.4 శాతం నిరుద్యోగులు. ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008 నుంచీ చూసు కుంటే కేంద్రంలో బీజేపీ వచ్చాక నిరుద్యోగిత రేటు పెరిగిందని నేషనల్ శాంపిల్ సర్వే కుండబద్దలు కొట్టింది. 2023 అక్టోబర్‌లో నిరుద్యోగిత రేటు 10.05 శాతానికి చేరింది. ఇదీ బీజేపీ పాలనలో దేశం వెలిగిపోతున్న దృష్టాంతం.
ప్రధాని అభ్యర్ధిగా 2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు. తొమ్మిదిన్నరేళ్లల్లో ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే నిరుద్యోగిత ఎందుకు కట్టలు తెంచు కుంటుంది? స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో ఉన్నాయి. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని, బీజేపీ పెద్దలు భాష్యాలు చెప్తున్నారు. ఈ చర్య నిరుద్యో గులను అపహాస్యం చేయడమే. ఇప్పటి వరకు రైతుల, వ్యవసాయ కార్మికుల ఆత్మహత్యల గురించే విన్నాం. ప్రస్తుతం నిరుద్యోగుల ఆత్మహత్యలూ సంభవిస్తున్నాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తెలుపుతు న్నాయి. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడటం సమాజానికి చేటు. దేశ జనాభాలో 35 ఏండ్ల లోపు యువత 66 శాతం ఉంటుందని ఒక అంచనా. కోట్లాదిగా ఉన్న వీరికి ఉద్యోగ, ఉపాధి లేకపోతే బీజేపీ ప్రచారం చేసుకునే ‘అచ్చేదిన్’ ఎలా ?
మోడీ ఎంచుకున్న నయా ఉదారవాద విధానాలు ఉపాధి రహిత భారతాన్ని నిర్మి స్తున్నాయి. ఈ వాస్తవాన్ని బీజేపీ సర్కారు సుతరాం అంగీకరించదు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతోంది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు అప్పనంగా ధారాదత్తం చేస్తోంది. దాంతో కొత్త ఉద్యోగా లేమోకానీ, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలో రెండు లక్షలకుపైన ఉద్యోగాలు నియా మకాల్లేక ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. పిఎల్‌ఎఫ్‌ఎస్ తాజా రిపోర్టు ప్రకారం తెలంగాణలో నిరుద్యోగిత రేటు 15.1 శాతం. జాతీయ సగటు కంటే మన రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. డిగ్రీలు, పీజీలు చేసిన యువకులు చాలామంది ఖాళీగా ఉంటున్నారు. కొంతమంది చిన్నపనులు చేసుకుంటూ పొట్ట పోసు కుంటున్నారు. పట్టాలు చేత పట్టుకుని ప్రయివేటు కంపెనీల చుట్టూ తిరిగేవారు అధికం. ఉద్యోగాలపై ఆశచావని వారు కోచింగ్‌సెంటర్లలో డబ్బులు వెచ్చించి మరీ సన్నద్దమవు తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగానికి మొదటి దోషి బీజేపీ అయితే రెండవ దోషి ఇక్కడ ఏలిన గత ప్రభుత్వం.నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల విధానాలు మారాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు మేనిఫేస్టోలో చెప్పిన విధంగా యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులను ఇదిగో..అదిగో అని ఊరిస్తున్న మెగా డిఎస్సీని వీలైనంత తొందరగా ప్రకటించాలి. లేదంటే నిరాశ,నిస్పృహాలతో ఉన్న యువత పోరాటబాటపడితే ఆపడం ఎవరితరం కాదనే విషయాన్ని గ్రహించాలి.