‘సతీ లీలావతి’..

'Sati Lilavati'..లావణ్య త్రిపాఠి, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్‌, ట్రియో స్టూడియోస్‌ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్‌ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఆనంది ఆర్ట్స్‌ సమర్పణలో తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. నాగమోహన్‌ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం  రామోజీ ఫిల్మ్‌ సిటీలోని సంఘి హౌస్‌లో ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్‌, నిర్మాతలు హరీష్‌ పెద్ది,  వి.ఆనంద ప్రసాద్‌, అన్నే రవి, డైరెక్టర్‌ తాతినేని సత్య తండ్రి, సీనియర్‌ డైరెక్టర్‌ టి.ఎల్‌.వి.ప్రసాద్‌ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత  హరీష్‌ పెద్ది క్లాప్‌ కొట్టారు. వరుణ్‌ తేజ్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, సీనియర్‌ డైరెక్టర్‌ టి.ఎల్‌.వి.ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ, ‘ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్‌టైనర్‌గా ఇది రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్‌ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నాం’ అని అన్నారు. ‘డైరెక్టర్‌ తాతినేని సత్య స్క్రిప్ట్‌ చెప్పగానే నేటి తరం ఆడియెన్స్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా అనిపించింది’ అని నిర్మాతలు నాగమోహన్‌ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి చెప్పారు.