క్వార్టర్స్‌లో సాత్విక్‌ జోడీ

satwik chirag– అశ్విని, తనీశ జంట సైతం
– మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌
భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌, చిరాగ్‌ జోరు కొనసాగుతోంది. సూపర్‌ సిరీస్‌ 1000 టోర్నీలో సాత్విక్‌, చిరాగ్‌లు అదరగొట్టారు. అలవోక విజయంతో మెన్స్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీశ క్రాస్టో జోడీ సంచలనం చేసింది. మెగా ఈవెంట్‌లో వరుసగా రెండో విజయంతో క్వార్టర్స్‌కు చేరుకుంది. కిదాంబి శ్రీకాంత్‌ పరాజయంతో మలేషియా ఓపెన్‌ సింగిల్స్‌ విభాగంలో టీమ్‌ ఇండియా పోరాటానికి తెరపడింది.
కౌలాలంపూర్‌ (మలేషియా)
2024 పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత తుది అంకంలోనూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ షట్లర్లు ఫామ్‌లోకి రావటం లేదు. పురుషుల, సింగిల్స్‌ విభాగాల్లో టీమ్‌ ఇండియా షట్లర్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకోలేకపోయారు. ఇదే సమయంలో డబుల్స్‌ స్టార్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో మాజీ వరల్డ్‌ నం.1 సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ అలవోకగా ప్రీ క్వార్టర్స్‌లో విజయం సాధించగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీశ క్రాస్టో జంట సైతం క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపింది. మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో మెరుపు విజయంతో ఆశలు రేపిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ ప్రీ క్వార్టర్స్‌లో నిరాశపరిచాడు. పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రక్రియలో తుది త్రైమాసికం ఆరంభం కావటంతో.. ఒలింపిక్‌ బెర్త్‌లో భారత షట్లర్లలో అలజడి మొదలైంది.
ఎదురులేదు :
పురుషుల డబుల్స్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి జోడీ.. మరో సూపర్‌ సిరీస్‌ 1000లో సత్తా చాటుతున్నారు. ఫ్రాన్స్‌ జంట లుకాస్‌, రోనన్‌లపై వరుస గేముల్లో గెలుపొందిన సాత్విక్‌, చిరాగ్‌లు 39 నిమిషాల్లోనే లాంఛనం ముగించారు. 21-11, 21-18తో ఎదురులేని విజయం నమోదు చేశారు. తొలి గేమ్‌లో సాత్విక్‌, చిరాగ్‌లకు ప్రత్యర్థుల నుంచి పోటీ లేదు. ఏకపక్షంగా పాయింట్లు సొంతం చేసుకున్నారు. 11-2తో విరామ సమయానికి తిరుగులేని ఆధిక్యం సాధించిన మనోళ్లు.. ద్వితీయార్థంలోనూ దుమ్మురేపారు. వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి ఔరా అనిపించారు. 21-11తో తొలి గేమ్‌ను అలవోకగా కైవసం చేసుకున్నారు. రెండో గేమ్‌లో ఫ్రాన్స్‌ జోడీ ప్రతిఘటించింది. విరామ సమయానికి రెండో సీడ్‌ సాత్విక్‌, చిరాగ్‌లకు ఝలక్‌ ఇచ్చింది. 11-6తో లుకాస్‌, రోనన్‌లు ముందంజ వేశారు. ద్వితీయార్థంలో వరుసగా ఐదు పాయింట్లతో పుంజుకున్న సాత్విక్‌, చిరాగ్‌లు 16-16 వద్ద స్కోరు సమం చేశారు. ఒత్తిడిలో మెరుపు స్మాష్‌లు సంధించి.. రెండో గేమ్‌ను 21-18తో గెల్చుకుని క్వార్టర్‌ఫైనల్లోకి చేరుకున్నారు. నేడు జరిగే క్వార్టర్‌ఫైనల్‌ సమరంలో చైనా జోడీ హీ జి టింగ్‌, రెన్‌ జియాంగ్‌ యులు సాత్విక్‌, చిరాగ్‌లకు సవాల్‌ విసరనున్నారు.
మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తనీశ క్రాస్టోలు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. 21-19, 13-21, 21-15తో మూడు గేముల మ్యాచ్‌లో ఏడో సీడ్‌ జపాన్‌ జంటకు షాక్‌ ఇచ్చారు. మయూ, నగహర జోడీ ఫేవరేట్‌గా బరిలోకి దిగినా.. అశ్విని, క్రాస్టోలు ఖతర్నాక్‌ గేమ్‌ ఆడారు. 62 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్స్‌ పోరులో 21-19తో తొలి గేమ్‌ను గెల్చుకుని పైచేయి సాధించారు. 11-9తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన భారత అమ్మాయిలు.. ద్వితీయార్థంలోనూ ఆధిక్యం నిలుపుకున్నారు. 16-16తో జపాన్‌ షట్లర్లు సమవుజ్జీగా నిలిచినా.. ఆఖర్లో వరుస పాయింట్లు సాధించారు. తొలి గేమ్‌ సొంతం చేసుకున్నారు.
జపాన్‌ అమ్మాయిలు దూకుడు పెంచిన రెండో గేమ్‌లో అశ్విని, క్రాస్టోలు వెనుకంజ వేశారు. కనీస పోటీ ఇవ్వలేకపోయారు. 13-21తో రెండో గేమ్‌ కోల్పోయారు. దీంతో మ్యాచ్‌ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. డిసైడర్‌లో అశ్విని, క్రాస్టో అదరగొట్టారు. 9-9 నుంచి వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి వెళ్లారు. జపాన్‌ అమ్మాయిలు ద్వితీయార్థంలో కోలుకోలేకపోయారు. 21-15తో మూడో గేమ్‌తో పాటు సూపర్‌ సిరీస్‌ 1000 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు. నేడు క్వార్టర్‌ఫైనల్లో కొరియా జోడీ రిన్‌, కిరులతో అశ్విని, క్రాస్టోలు పోటీపడనున్నారు. ఇదిలా ఉండగా, పురుషుల సింగిల్స్‌లో మాజీ వరల్డ్‌ నం.1 కిదాంబి శ్రీకాంత్‌ ఓటమి చెందాడు. తొలి రౌండ్లో మెరుపు విజయం సాధించినా.. హాంగ్‌కాంగ్‌ షట్లర్‌ లాంగ్‌ ఆంగస్‌ చేతిలో వరుస గేముల్లో నిరాశపరిచాడు. 13-21, 17-21తో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. హెచ్‌.ఎస్‌ ప్రణరు, లక్ష్యసేన్‌ సైతం ఓటమి పాలవగా.. సింగిల్స్‌ విభాగంలో భారత పోరాటానికి తెరపడింది.
ashwini crasto