సాత్విక్‌, చిరాగ్‌ ముందంజ

సాత్విక్‌, చిరాగ్‌ ముందంజ– హెచ్‌.ఎస్‌ ప్రణరు పరాజయం
– థాయ్ లాండ్‌ ఓపెన్‌ 2024
బ్యాంకాక్‌ (థాయ్ లాండ్‌) : భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి, చిరాగ్‌ శెట్టి శుభారంభం చేశారు. టాప్‌ సీడ్‌ భారత జోడీ పురుషుల డబుల్స్‌ విభాగం ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. మలేషియా షట్లర్లు నూర్‌ మహ్మద్‌, వీ కియోంగ్‌లపై 21-13, 21-13తో వరుస గేముల్లో గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో సీనియర్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌ ప్రణరు నిరాశపరిచాడు. సహచర షట్లర్‌ లువాంగ్‌ చేతిలో 19-21, 18-21తో వరుస గేముల్లో కంగుతిన్నాడు. అర్హత మ్యాచుల్లో రాణించి ప్రధాన టోర్నీకి వచ్చిన లువాంగ్‌ తొలి రౌండ్లోనే సహచర భారత స్టార్‌పై సంచలన విజయం సాధించాడు. మరో క్వాలిఫయర్‌ సతీశ్‌ కుమార్‌ 13-21, 17-21తో పరాజయం పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో అష్మిత చాలిహ 19-21, 21-15, 21-14తో ఇండోనేషియా అమ్మాయిని చిత్తు చేసి ప్రీ క్వార్టర్స్‌లో కాలుమోపింది. ఉన్నతి హుడా 21-14, 14-21, 9-21తో మూడు గేముల మ్యాచ్‌లో నిరాశపరిచింది