ఛాంద‌స భావాల‌ను ధిక్క‌రించిన స‌త్య‌వ‌తి

Satyavati who defied sentiments of Chandasaవేములపల్లి సత్యవతి… ఈ కాలపు కార్యకర్తలకు ఆమె ముఖ పరిచయం లేకపోయినా ఆమె రచనల ద్వారా సుపరిచితులే. 2004 నుండి చైతన్య మానవి పత్రికకు స్త్రీల వీరోచిత గాథలు, జీవితాలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ఉద్యమాలను అందిస్తూ వచ్చారు. అవి చదివిన మాకు ఈ వయసులో ఇంత సమాచారాన్ని ఎలా సేకరించగలరనిపించేది. పత్రిక ఒకరోజు ఆలస్యమైతే ఫోన్‌ చేసి పత్రిక రాలేదని అడిగేవారు. మృదు స్వభావి. ఐద్వా కార్యకర్తలను అమితంగా గౌరవించేవారు. అక్షరాలతో సమాజాన్ని మార్చగలం అని బలంగా నమ్మే ఆమె ఇటీవలె తన 92వ ఏట అనారోగ్యంతో మరణించారు.
సత్యవతి సూర్యాపేట తాలూకాకు 3,4 కిలోమీటర్ల దూరంలోని బీబీ గూడెంలో పుట్టారు. ఆనాడు నైజాం నిరంకుశ పరిపాలనలో చదువుకునే అవకాశాలుండేవి కావు. పల్లెల్లో బడులుండేవి కావు. తాలూకా కేంద్రాల్లో 5వ తరగతి వరకు, జిల్లా కేంద్రంలో హైస్కూలు వరకు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇసుకలోనే ఆమె అ,ఆ నేర్చుకున్నారు. ఆమెకు చదువు కోవాలనే కోరిక బలంగా ఉండేది. చిన్నతనంలో అమ్మమ్మ ఊరైన కృష్ణాజిల్లా కాటూరులో ప్రాథమిక విద్య నభ్యసించారు. పదేండ్లు రాగానే తల్లిదండ్రులు కాటూరు నుండి బీబీ గూడెం తీసుకెళ్లారు. అంతటితో ఆమె చదువు ఆగిపోయింది. ‘ఆడవాళ్లు చదివి ఊళ్లు ఏలాలా? ఉద్యోగాలు చేయాలా? ఉత్తరం ముక్క చదవటం వస్తే చాలు’ అనుకునే రోజులవి. ఆడ పిల్లలకు చదువుకునే అవకాశాలు ఉండేవి కావు. డబ్బున్న కుటుంబాల్లో పిల్లలకు ట్యూషన్‌ మాస్టారును పెట్టి చదివించేవారు.
మార్పువైపు…
సత్యవతి బాబాయి వేములపల్లి భాస్కరరావు ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ పట్టా పుచ్చుకున్నారు. నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఏర్పడింది. వారితో భాస్కరరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. జాతీయోద్యమ పుస్తకాలు, పత్రికలు ఇంటికి తెచ్చేవారు. వాటిని ఆమె కూడా చదివేవారు. గోర్కీ ‘అమ్మ’ నవల, తాపీ ధర్మారావుగారు మద్రాసు నుండి ప్రచురించే ‘గృహలక్ష్మి’ పత్రిక చదివి జాతీయోద్యమంలో పాల్గొనాలనే కోరిక బలంగా ఉండేదని, మార్పు వైపు మనసు పరిగెడుతోందని, నైజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని కోరిక బలపడుతోందని ఆమె స్వీయ రచనలో రాసుకున్నారు.
మహిళా సంఘంలో…
ట్యూషన్‌ మాస్టారు సుబ్బారావు సాయంతో ఇల్లు దాటి విజయవాడలో కమ్యూనిస్టు పార్టీ ఆఫీసుకి చేరుకున్నారు. తన మనోభావాలను నాయకుల ముందు వ్యక్తపరిచారు. 1943 నుండి 1948 వరకు విజయవాడలో డా||అచ్చమాంబ, మానికొండ సూర్యవతి, చండ్ర సావిత్రీదేవి, తాపీ రాజమ్మతో కలిసి మహిళా సంఘంలో పని చేశారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించటంతో పార్టీ నాయకత్వం అజ్ఞాతంలోకి వెళ్లింది. దాంతో సత్యవతి అమ్మమ్మ ఊరు కాటూరు చేరుకున్నారు. అప్పట్లో పామర్రు దగ్గర ఉన్న కొండపర్రు గ్రామంలో యలమంచు వెంకటేశ్వరావు విద్యావనం అనే స్కూలు నిర్వహిస్తున్నారు. చదువుకోవాలనే ఆమె కోరికను మేమేమామతో చెప్పడంతో విద్యావనంలో చేర్పించారు. 1948 సెప్టెంబర్‌ 17న తెలంగాణా విమోచకం జరిగింది. అజ్ఞాత వాసంలో ఉన్న వారు ఇళ్లకు చేరుకున్నారు.
విశ్లేషణాత్మక వ్యాసాలు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న పొట్లూరి వెంకటేశ్వరరావు (వెంపో)తో ఆమెకు ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. బీబీనగర్‌లో పెద్దల సమక్షంలో పూలదండలతో వివాహం చేసుకున్నారు. తన భావాలతో ఉన్న వ్యక్తి భర్త అయినందుకు సంతోషపడ్డారు. బతుకు తెరువు కోసం నల్గొండలో హిందీ టీచర్‌గా పని చేశారు. ఉద్యమాల్లో పని చేయలేక పోయానని బాధపడేవారు. ‘పోరాటాలు చేస్తాం, ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తాం. కానీ వాటిని విశ్లేషించి రాయటం కష్ట సాధ్యమనుకుంటాం’ అనేవారు తెలంగాణా సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం. ఆ లోటును సత్యవతి భర్తీ చేశారు. తెలంగాణా సాయుధ పోరాటంలో ‘మహిళా వీర గాథలు’ చాలా వివరణాత్మకంగా రాశారు. స్వాతంత్య్రోద్యమంలో ‘శ్రీమతి కామా’ గురించి స్ఫూర్తినిచ్చే విధంగా రాశారు. అలాగే తాపీ రాజమ్మ గురించి కూడా అద్భుతంగా రాశారు. ‘అమ్మలకు ఆదరణలు – నిరాదరణలు’ అనే వ్యాసంలో ‘నిన్ను కన్నవారు నీ ఎదుట ఉండగా కూడు, గుడ్డ పెట్టి కొలవ లేవు, నీవు చూడలేని దేవుడున్నాడనుచు కూడు గుడ్డ పెట్టి కొలవనేల’ అంటారు.
ఆలోచింపజేసేలా…
ప్రపంచీకరణ తర్వాత అమ్మ పరిస్థితి ఎలా ఉందో ఐదుగురు అమ్మల గురించి సోదాహరణంగా రాశారు. అలాగే సతీసహగమనాన్ని రూపుమామేందుకు ఎంతో కృషి చేసిన రాజా రామ్మోహనరారు గురించి చాలా వివరణాత్మకంగా రాశారు. ‘దేశం కోసం’ వ్యాసంలో కాన్పూర్‌లో స్వాతంత్య్ర పోరాటంలో జరిగిన ఒక బాలుడి ఉదంతాన్ని రాసిన వ్యాసం పాలకుల కనువిప్పు కలిగించేలా ఉంది. 1996లో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టినపుడు చేసిన రభస, మహిళలపై ఆనాడు చేసిన వ్యాఖ్యలు పితృస్వామ్య ధోరణులు ఏ రకంగా ప్రతిబింబిచాయో కండ్లకు కట్టినట్టు రాశారు. ‘నా మొగుడేగా కొట్టిండు’ రచనలో గృహహింస రక్షణ చట్టం వచ్చినా దాని అమలు తీరు తెన్నులు పట్టించుకోని పాలకులను, పురుషహంకారం గురించి ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణల రూపంలో రచించారు. పరభాషా వ్యామోహాలు కొట్టుకుపోయి మాతృ భాషను మరవద్దు అంటూ రాశారు.
బహుముఖంగా…
ఆమె ప్రతి రచనా ఆలోచింపచేసేదిగా, విజ్ఞానాన్ని అందించేదిగా ఉండేది. ఇలా తెలియని అనేక కొత్త విషయాలను సరళమైన భాషలో పాఠకులకు అందించేవారు. ఇలా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో ఆమె పాల్గొనకపోయినా తన సాహిత్యంతో మహిళల్లో చైతన్యం నింపేవారు. ఆమె రాసిన వ్యాసాల సంకలనాలను రెండు తెలుగు రాష్ట్రాల ఐద్వా కమిటీల ఆధ్వరంలో ‘మహిళా దృక్ఫథం’ పేరుతో 2018లో ప్రచురించారు. ఉద్యమకారిణిగా, సంస్కరణవాదిగా, రచయితగా, ఉపాధ్యాయురాలిగా, హేతువాదిగా బహుముఖంగా సమాజానికి, ముఖ్యంగా మహిళాలోకానికి ఉపయోగపడే జీవనయానం సాగించిన వేములపల్లి సత్యవతికి ఐద్వా జోహార్లు అర్పిస్తుంది.
తిరుగుబాటు
కడప జిల్లా కనపర్తి వరలక్ష్మి ఆనాడు ఆడపిల్లల బడి నడపటం ఆమెను ప్రభావితం చేసింది. గుమ్మదుల దుర్గాబాయమ్మ ఎల్‌.ఎల్‌.బి పట్టా పుచ్చుకుని దిగిన ఫొటో పత్రికల్లో ముద్రించారు. అది చూసిన తర్వాత ఆమెలో చదువు కోవాలనే కోరిక మరింత బలపడింది. అయితే ఆమెకు 14 ఏండ్ల రావటంతో ఇంట్లో పెండ్లి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘దాన్ని తప్పించుకోవటం ఎలా?’ అని మధనపడ్డారు. చివరికి బూజు పట్టిన చాంధసభావాలపై తిరుగుబాటు చేయాలని నిర్ణయించుకున్నారు. బలవంతపు పెండ్లి వద్దని అంత చిన్న వయసులోనే ఎదిరించి విజయం సాధించారు.
– కె.స్వరూపరాణి