బీజేవైఎం ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ బొమ్మతో శవయాత్ర

– అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ గురువారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యాలయం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు ఆయన బొమ్మతో శవయాత్ర చేసేందుకు బీజేవైఎం శ్రేణులు యత్నించాయి. పార్లమెంట్‌ సాక్షిగా హిందూవులకు రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి అనుమతి లేదంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుటనే పోలీసులు భారీకేడ్లతో అడ్డుకున్నారు. ముందుకు దూసుకెళ్లేందుకు యత్నించగా బీజేవైఎం నాయకులు, పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. దీంతో అక్కడే రాహుల్‌గాంధీ బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్‌ మాట్లాడుతూ..పోలీసులు లాఠీచార్జి చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.