
– వరి పంటపై తెప్పలుగా కోళ్ల మలం, కెమికల్స్
– ఆందోళన వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు
నవతెలంగాణ – రాయపర్తి
శ్రీ సత్యనారాయణ స్వామి పౌల్ట్రీ హాచరీస్ నుండి వచ్చే దుర్వాసన, కోళ్ల మలం, కెమికల్స్ నుంచి తమను కాపాడండి మహాప్రభో అని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రం శివారులోని మంచినీళ్ల చెరువు సమీపంలో నిర్మించిన శ్రీ సత్యన్నారాయణ స్వామి హాచరీస్ తమ పాలిట యమపాశంగా మారిందని సోమవారం బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌల్ట్రీ హాచరీస్ కోళ్ల మలాన్ని ఎస్సారెస్పీ కాలువ వెంబడి కుప్పలు తేప్పలుగా వేయడంతో ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వస్తుందని బాధపడుతున్నారు. కోడి వ్యర్ధాలపై కొంగలు వాలి పంటనంత నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే పౌల్ట్రీ హాచరీస్ ఓనర్ మీ భూములు అమ్మండి కొనుగోలు చేస్తా అని బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపారు. దుర్వాసన కారణంగా వ్యవసాయ కూలీలు కూడా రావడం లేదని దాంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని వ్యాఖ్యానించారు. కెనాల్ కాలవ వెంబడి ఉండే దారి హాచరీస్ నుండి వచ్చే వాహనాల కారణంగా గుంతల మయం అయ్యిందని ఆధారాలతో చెబుతున్నారు. వర్షాలలు వస్తే కోళ్ల మలం పంట పొలాలను నాశనం చేయడమే కాకుండా నేరుగా వెళ్లి మంచినీళ్లు చెరువులో కలుస్తుందని తెలిపారు. అధికారులు పౌల్ట్రీ హచరీస్ నుండి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. ఈ ఆందోళనలో కుంట రాజు, గుగులోత్ చోక్ల నాయక్, కుంట రాజు, కుంట హనుమంత్, యాకుబ్, దేవా, కుంట శ్రీను తదితరులు పాల్గొన్నారు.