రైతులను రక్షించండి… దేశాన్ని కాపాడండి

– కార్పొరేట్లను తరిమికొట్టండి
– ఆత్మహత్యలు కాదు.. పోరాటమే మార్గం
– రైతు వ్యతిరేక మోడీ సర్కార్‌కు ఇక గడ్డు రోజులే
– దేశం నలుమూలలకు ఆందోళన : కిసాన్‌ మహాపంచాయత్‌లో ఎస్కేఎం నేతలు
న్యూఢిల్లీ: ”రైతులను రక్షించండి, దేశాన్ని కాపాడండి…కార్పొరేట్లను తరిమికొట్టండి” అంటూ సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నేతలు పిలుపు ఇచ్చారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని, నిరంతర పోరాటమే మార్గమని స్పష్టం చేశారు. సోమవారం నాడిక్కడ రాంలీలా మైదానంలో జరిగిన కిసాన్‌ మహాపంచాయత్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు పాల్గొన్నారు. ఢిల్లీ నలుమూలల నుంచి ప్రదర్శనలతో రైతులు ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తిస్తూ రాంలీలా మైదానానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ బుజ్జగింపు విధానాలపై రైతాంగం పోరాట ఘోషగా ఈ మహా పంచాయత్‌ మారింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎస్కేఎం నేతలు మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాల అమలు, రైతు వేధింపులకు పాల్పడిన మోడీ ప్రభుత్వానికి గడ్డు రోజులు రానున్నాయని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ మహా పంచాయితీతో ఆందోళన దేశం నలుమూలలకూ విస్తరిస్తుం దని తెలిపారు. గ్రామాలవారీగా రైతులను సంఘటితం చేసి పోరాటంలో భాగస్వామ్యం చేస్తామన్నాని పేర్కొన్నారు.
దేశమంతటా పోరాటం: విజ్జూ కృష్ణన్‌
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ దోపిడీకి వ్యతిరేకంగా దేశమంతటా పోరాటం విస్తరిస్తుందని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ అన్నారు.కిసాన్‌ సభ నేతృత్వంలో విజయవంతమైన మహారాష్ట్ర రైతుల లాంగ్‌ మార్చ్‌ను విజ్జూ కృష్ణన్‌ ఉదహరించారు. రైతులు ఎక్కడ సంఘటితమై పోరాడారో, అక్కడ ప్రభుత్వం దిగొ చ్చిందని అన్నారు. దేశంలో రైతుల పరిస్థితి మరీ అధోగతిలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యామ్నాయ విధానాల కో సం దేశం బలమైన పోరాటాన్ని చూస్తుందని ప్రకటించారు.
కేరళ తరహాలో రైతు రుణ ఉపశమన చట్టం తీసుకురావాలి :వడ్డే శోభానాద్రీశ్వరరావు
కేరళ తరహాలో జాతీయస్థాయిలో రైతు రుణ ఉపశమన చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. మోడీ ప్రభుత్వం రైతుల పట్ల అంతులేని వివక్ష చూపుతోందని విమర్శించారు. అధి కారంలోకి వస్తే స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తా మని ఎన్నికల ముందు ప్రకటించిన మోడీ ప్రభు త్వం, దాన్ని అమలు చేయ లేదని దుయ్య బట్టారు. రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, కార్పొ రేట్లకు కట్టబెట్టి విధానాలు అమలు చేస్తుందని విమర్శిం చారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే విద్యుత్‌ బిల్లును తీసుకొచ్చారని విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏపీ నుంచి ఎస్కేఎం నేతలు రావుల వెంకయ్య, కెవివి ప్రసాద్‌, ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, కుర్రా నరేంద్ర, కొల్లా రాజమోహన్‌, చుండూరు రంగారావు, గుండపనేని ఉమా వరప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, రైతు సంఘం నాయకులు ఎం. యెల్ల మందారావు తదితరులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి :జక్కుల వెంకటయ్య
అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని తెలంగా ణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య డిమాండ్‌ చేశారు. అటవీ నియమాల పేరుతో అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని ఆపాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి గోపాల్‌, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎండి కాజా మొద్దీన్‌, మహేష్‌, పరంజ్యోతి, సైదులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రితో ఎస్కేఎం బృందం భేటీ
అఖిల భారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షుడు హన్నన్‌ మొల్లా ఆధ్వర్యంలో కిసాన్‌ మోర్చా నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, సహాయ మంత్రి కైలాష్‌ చౌదరిని కలిసి పది డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. తమకు ఇచ్చిన లిఖితపూర్వక హామీలను సకాలంలో అమలు చేయకుంటే దేశంలో తీవ్ర ఆందోళనలు తప్పవని 15 మంది సభ్యుల బృందం హెచ్చరించింది. దీంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అక్కడ నుంచి ఎస్కేఎం నాయకులు మహా పంచాయతీ వేదిక వద్దకు వచ్చి ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని రైతులకు వివరించారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ, మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేసి, రైతు నాయకులతో కూడిన కొత్త కమిటీని వేయాలని, విద్యుత్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతులకు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్‌ వంటి డిమాండ్లను కేంద్రమంత్రికి వివరించారు.