– ఇప్పటికీ ఆరని మణిపూర్ మంటలు
– గాడి తప్పిన పరిపాలన
– దేశంలో కాంగ్రెస్‌దే అధికారం
– తుక్కుగూడ జనజాతర సభకు తరలిరండి : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ
నవతెలంగాణ-కందుకూరు
దేశాన్ని బీజేపీ నుంచి రక్షించాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. కుల, మతాల మధ్య చిచ్చు రగిలించి ఈ దేశ ప్రజలను విచ్ఛినం చేస్తున్నారని, దానికి ఉదాహరణే మణిపూర్‌లో రేపిన మంటలని, అవి ఇప్పటికీ ఆరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో శనివారం నిర్వహించే జనజాతర సభ ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌తో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చి 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని విమర్శించారు. దేశంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే, ప్రభుత్వ రంగ సంస్థలను తక్కెడలో పెట్టి అమ్ముతారని ఆరోపించారు. దేశంలో పాలన గడి తప్పిందని, దాన్ని సరైన దారిలో పెట్టాలంటే బీజేపీని అధికారంలోకి రాకుండా ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కచ్ఛితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో సభ జరుపుకున్నామని, కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. అదే సెంటిమెంట్‌తో ప్రధానమైన భారీ బహిరంగ సభను మళ్లీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారని అన్నారు. దేశం కోసం, ప్రజల రక్షణ కోసం, న్యాయ వ్యవస్థను కాపాడటం కోసం, దేశ ప్రజల కోసం ఈ సభా స్థలం నుండే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుందన్నారు. నేడు జరగబోయే జన జాతర బహిరంగ సభకు రాష్ట్ర ప్రజలంతా మద్దతు తెలపి లక్షలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.