నిరుద్యోగులను విడుదల చేయాలి : సేవెళ్ల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
టీజీఎస్‌పీఎస్‌సీ ముట్టడికి బయలుదేరిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్‌ అన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తున్న వైఖరి సరిగాలేదన్నారు. గ్రూప్‌-1 మెయిన్స్‌ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలనీ, గ్రూప్‌-2లో 2000, గ్రూప్‌-3లో 3000 పోస్టులు ఇవ్వాలనీ, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలని అడగటం తప్పా అని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని కోరారు. క్రిమినల్‌ కేసులు పెడతామని నిరుద్యోగులను పోలీసులు బెదిరించడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రంలోని30 లక్షల మంది నిరుద్యోగులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగులపై ఇలా వ్యవహరిస్తే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.