పిల్ల‌ల‌కు పొదుపు పాఠాలు

Savings Lessons for Kidsపిల్లల్ని ప్రయోజకులను చేసేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. వారి చదువుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అయితే చదువుతో పాటు పిల్లలకు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. పిల్లలు అన్ని విషయాలు చాలా వరకు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. ఆహారపు అలవాట్లు, మంచి చెడులే కాదు… ఆర్థిక అలవాట్లు కూడా వారే నేర్పించాలి. అయితే వాటిని పాఠాలు చెప్పినట్లుగా కాకుండా రోజు వారీ పనుల్లో భాగంగా నేర్పిస్తే ఎప్పటికీ గుర్తుంటాయి. అదెలాగో ఈ రోజు తెలుసుకుందాం…
మన దగ్గర చాలా మంది మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తమ భర్తపై ఆధారపడుతుంటారు. దాని వల్ల సొంత నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే నేటి తరం అమ్మాయిలు ఉద్యోగం పొందరకముందే సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని తీర్చిదిద్దడం అవసరం. దీనికోసం ఇంట్లో జరిగే ఆర్థిక చర్చల్లో వారిని భాగం చేయాలి. ఫలితంగా వారికి ఆర్థిక ప్రణాళిక, పన్నులు, ఖర్చులు వంటి వివరాలపై అవగాహన వస్తుంది. ఆర్థికపరమైన విషయాల గురించి మీ అమ్మాయితో చర్చించండి.
మూడు నుండి ఏడేండ్ల వయసులో
పారదర్శకంగా ఉండే రెండు జార్లను పిల్లలకు బహుకరిం చండి. ఒకదానిపై పొదుపు అని, ఇంకోదానిపై ఖర్చు అని రాయండి. పుట్టినరోజు వంటి సందర్భాల్లో పెద్దలిచ్చే డబ్బులను వాటిలో వేయమని చెప్పండి. మొదటిది పెద్ద పెద్ద వస్తువులను కొనుగోలు చేయడానికి వాడుకోవాలని, రెండోది వాళ్లకిష్టమైన చిరుతిళ్లు వంటివి కొనుక్కోవడానికి అని చెప్పండి. వీలైతే మూడో జార్‌ కూడా పెట్టండి. దాన్ని దాతృత్వానికి కేటాయించమని చెప్పండి. డబ్బులివ్వడమే కాదు. ఏదైనా లక్ష్యం పెట్టుకొమ్మని చెప్పండి. ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో అడగండి. దానికి ఎంత అవుతుందో చెప్పి అది సాధించేంత వరకు ప్రోత్సహించండి. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి. ఒక్కసారి ఆ మొత్తం సమకూరాక, ఆ డబ్బు ఇచ్చి చిన్నారి చేతుల మీదుగానే కొనిపించండి. అది వారికి డబ్బులు సంపాదించి, మనకు కావాల్సినదానిని కొనుక్కోవడానికి పడే కష్టం విలువను నేర్పిస్తుంది. ఎక్కడైనా మాల్స్‌లో మన వంతు వచ్చేంత వరకు నిలబడి ఉన్నప్పుడు, మనం కావాలనుకున్నది లభించడానికి వేచిచూడడం ఎంత ముఖ్యమో చెప్పండి. వారికీ అర్థమవుతుంది.
ఏడు నుండి పదమూడేండ్లపుడు
ఈ వయసులో ఆర్థిక నిర్ణయాల విషయంలో పిల్లల్ని పాలు పంచుకోనివ్వాలి. ఎలాగంటే ఒకే వస్తువు వేర్వేరు బ్రాండ్లలో తక్కువకు వచ్చేది ఏదో గమనించేలా చేయాలి. రోజూ మనం కొనుగోలు చేసే పాలు, గుడ్లు వంటి వాటిని కనీసం రూపాయి తగ్గేలా ఎలా పొందొచ్చో ఆలోచించమని చెప్పాలి. వీలైతే అవి విక్రయించే వేర్వేరు అంగళ్లకు తీసుకెళ్లి వారితోనే మాట్లాడించాలి. ఇంటిని శుభ్రం చేసినప్పుడు, కూరగాయలు తరిగినప్పుడు, ఇలా ఏవైనా పనులు చేసినప్పుడు వారిని ఉత్సాహపరుస్తూ కొంత కమీషన్‌ ఇవ్వండి. ఇది తమ కష్టానికి ఇచ్చే డబ్బు విలువను తెలియపరుస్తుంది. డబ్బులు పరిమితమని, అపరిమితం కాదని తెలిసేలా చేయాలి. ఎలాగంటే వారి చేతికి ఓ వంద ఇచ్చి సూపర్‌మార్కెట్లో దానితో నీకిష్టమైనవి కొనుక్కోమని చెప్పాలి. ఆ వందలోనే ఏవి కొనాలి, ఎంత మిగుల్చుకోవాలో తెలుసుకునేలా చేయాలి. ఏదైనా కొనడానికి షాపింగ్‌కు వెళ్లినపుడు మనం అడిగే ప్రశ్నలను విని వారూ అనుసరించేలా చూడాలి. నిజంగా ఈ వస్తువు అవసరమా? దీన్ని కొనాలా లేదంటే అద్దెకు తెచ్చుకోవచ్చా? మరో చోట ఇది తక్కువకు లభిస్తుందా? రెండు కొంటే ఒకటి ఉచితంగా వస్తుందా లేదంటే వేరే బ్రాండ్‌పై ఆఫర్లు ఉన్నాయా? వంటి వాటిని తల్లిదండ్రులు చర్చిస్తూ ఉంటే పిల్లలకూ అలవాటవుతుంది.
14 నుండి 18 ఏండ్ల పిల్లలకు
ఈ వయసు వారికి ఎలాగూ స్కూల్లో మ్యాథ్స్‌ పాఠాలు నేర్పుతారు. వాటిని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలో తెలియజేయాలి. ‘ఈ చిన్న వయసులోనే ఏటా నువ్వు ఐదు వేల చొప్పున ఆదా చేస్తే 60 ఏండ్ల నాటికి ఎంత అవుతుంది? అదే 35 ఏండ్ల తర్వాత ఆదా చేస్తే 60 ఏండ్లు నాటికి ఎంత అవుతుందో లెక్కలేయమని చెప్పాలి. ఆ లెక్కల నుంచి తక్కువ వయసులో పొదుపు చేస్తే వచ్చే ప్రయోజనాలు తెలుస్తాయి. చిన్న వయసులో మదుపుకు అలవాటు పడతారు. సాధారణంగా షాపింగ్‌ మాల్‌కు వెళ్లినపుడు ‘ఈ డ్రెస్సు ఎంత బాగుందో కదా! కొనివ్వవా’ అంటుంటారు. అది మరీ ఎక్కువ ధర అయినపుడు, దాన్ని రేపటికి వాయిదా వేయండి. ఎందుకంటే ఇష్టంగా ఉన్నప్పుడు మెదడు పని చేయదు. తర్వాతి రోజు కచ్చితంగా మనసు మారుతుంది. తొమ్మిదో తరగతి నుంచే వారికి తమ చదువుకు ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పండి. మన ఆర్థిక వనరులు, ఇంటి పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పండి. మంచి ర్యాంకు తెచ్చుకుంటే డబ్బుతో సంబంధం లేకుండా ఉచిత సీట్లు పొందే అంశాలనూ తెలియజేయండి. విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌ల వంటి వాటి గురించి అవగాహన కల్పించండి.
18 నుండి 21 ఏండ్ల పిల్లలకు
ఈ వయసు వారికి మనం చెప్పడానికి ఏమీ ఉండదు. పైన చెప్పినట్లు చేసుకుంటూ వస్తే ఈ వయసుకల్లా వారు తమ కాళ్లపై తాము నిలబడే ఉంటారు. లేదంటే సొంత నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం తెచ్చుకునే ఉంటారు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, క్రెడిట్‌ కార్డుల వినియోగం ఈ వయసులోనే చెప్పాలి. ఇంకా వీలుంటే డీమ్యాట్‌ ఖాతాలనూ తెరిపించి మ్యూచువల్‌ ఫండ్‌లలో సిప్‌ చేయించవచ్చు. నెలకు కనీస మొత్తాన్ని వారితోనే అందులో పెట్టించవచ్చు. ఉద్యోగం చేయాలా లేదంటే సొంతంగా ఓ సంస్థనే పెట్టాలా అన్నదాన్ని వారికే వదిలేయండి. ఎందుకంటే వారి గురించి వారి కంటే ఎవరికి బాగా తెలుస్తుంది చెప్పండి.