మహిళా సాధికారతకు ప్రతీక సావిత్రి బాయి పూలే

Savitri Bai Phule is a symbol of women empowermentసావిత్రిబాయి పూలే భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని పేరు. ఓ ఉద్యమకారిణి, ఉపాధ్యాయురాలు, రచయిత్రి, సంఘ సంస్కర్త. అణగదొక్క బడిన వర్గాలు, ముఖ్యంగా మహిళల సాధికారత కొరకు దళితుల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగశీలి. ఈ రోజు ఆమె జయంతి.
సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నమ్‌గావ్‌లో జన్మించారు. చిన్న వయసులోనే సంఘ సంస్కర్త అయిన జ్యోతి రావ్‌పూలేతో వివాహం జరిగింది. పెండ్లి తర్వాత భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగించారు. చదువుకునేందుకు ముందు ఆమె ఆసక్తి చూపకపోయినా ‘నువ్వు చదువుకుంటే ఇతర అమ్మాయిలకు చదువు చెప్పవచ్చు’ అని ఆమెను ఒప్పించి చదువుకునేలా చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావ్‌ పూలే. తర్వాత కాలంలో ఈ జంట భారతదేశంలోని కుల వ్యవస్థ, స్త్రీల అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమించింది.
1847నాటికీ సావిత్రిబాయి భర్తతో కలిసి పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఆ కాలంలో బాలికలకు విద్య అందించడం అంటే చాలా పెద్ద విప్లవం. వారు ఆ పాఠశాల నడపడం కొన్ని వర్గాల ప్రజలకు నచ్చలేదు. దీంతో సావిత్రి బాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకునే వారు. అయినా ఆమె పట్టు వీడక సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం, గుర్తింపు లభించాయి. ఈ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అనేక మంది బాలికల జీవితాల్లో మార్పు తెచ్చారు. సావిత్రిబాయి కేవలం విద్యా రంగంలోనే కాకుండా, సమాజంలోని అనేక సమస్యలపై పోరాటం చేశారు. వితంతువుల సమస్యలు, బాల్య వివాహాలు, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై గళం ఎత్తారు. తన రచనల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలను బద్దలు కొట్టారు. 1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేసాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతంల్లోని పేదలకు సావిత్రి బాయి జోలెపట్టి విరాళాలు సేకరించి బాధితులకు అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలు అందించారు. ప్లేగు వ్యాధి సోకిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితులలో కూడ రోజుకు రెండు వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు. 1897లో, మార్చి10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాదే సోకి మరణించారు.
సావిత్రిబాయి తన జీవితకాలంలో అనేక అవమానాలు, అణచివేతలు ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యం నుండి వెనక్కి తగ్గలేదు. అలాంటి మహౌన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆమె భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. ఆమె చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు భారతీయ మహిళలు అనేక రంగాల్లో ముందుకు వస్తున్నారు. అంతేకాదు ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆమె జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం.
– పల్లె నాగరాజు, 8500431793