తొలి మహిళా ఉపాధ్యాయులు, ఆదర్శనీయులు సావిత్రిబాయి ఫూలే

–  బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సమాజానికి గొప్ప ఆదర్శనీయులు సావిత్రిబాయి పూలే అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ కొనియాడారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఆయనతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలె భాస్కర్‌, తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ..సమాజంలో వితంతువుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ఆమె అనేక పోరాటాలు నడిపారని గుర్తుచేశారు. వితంతువులను దగ్గరకు తీసి ఆశ్రయం కల్పించి అందరితో సమానం బతికాలని తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి అని కొనియాడారు. విద్యా, వైద్య, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించేలా ప్రధాని మోడీ తోడ్పాటునందిస్తున్నారని చెప్పారు. 11 మంది మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించారన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ, ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. ముస్లిం మహిళలకు స్వేచ్ఛ కల్పించేలా ట్రిబుల్‌ తలాక్‌ ను రద్దు చేశారని కొనియాడారు.