
– పూలే విగ్రహావిష్కరణ, మహిళా సదస్సును విజయవంతం చేయాలి
నవతెలంగాణ – పెద్దవంగర
మహిళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిబాయి పూలే అని, ఆమె ఆశ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమారపు ఐలయ్య అన్నారు. బుధవారం చిన్నవంగర ప్రాథమికోన్నత పాఠశాలలో ఈ నెల 10 న జిల్లా కేంద్రంలో జరిగే పూలే విగ్రహావిష్కరణ, మహిళా సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్త్రీ విద్య విప్లవ కారిణి, నేటి మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. స్త్రీల బానిసత్వానికి విముక్తి పలికి, విద్య, విజ్ఞానం, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను జాతికి ప్రసాదించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త, భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అని పేర్కొన్నారు. సావిత్రిబాయి సేవలు యావత్ ప్రజలు మరువలేరన్నారు. 1848లో ఉపాధ్యాయురాలిగా ఆమె 42 పాఠశాలలను స్థాపించారని తెలిపారు. సావిత్రిబాయి పూలను ఆదర్శంగా తీసుకుని, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈనెల 10 న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని టీపీటీఎఫ్ భవన్ లో జరిగే పూలే విగ్రహావిష్కరణ, మహిళా సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు సురేష్, వెంకటేశ్వర్లు, మురళి, శ్రీనివాస్, ప్రకాష్, నాగమణి, వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయులు వెంకయ్య, అజయ్, యాకుబ్ రెడ్డి, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.