– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు..
నవతెలంగాణ – వేములవాడ
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే నేటి విద్యార్థులకు ఆదర్శనీయమనిఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ కొనియాడారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ .. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలే నేటి విద్యార్థులకు ఆదర్శనీయమని తెలిపారు. ఆడపిల్లలకు చదువు కోసం మొట్టమొదటిసారి పాఠశాలను స్థాపించి వారికి విద్యను అందించిన గొప్ప సంఘసంస్కర్త ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అనేక అవమానాలను ఎదుర్కొని, నాటి మూఢచారాలకు వ్యతిరేకంగా మహిళలకు విద్యను అందించడమే ధ్యేయంగా పనిచేయడంలో అగ్రభాగాన నిలిచిన సావిత్రిబాయి పూలే, కృషి వల్లనే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారని చెప్పారు. చదువుల తల్లి అంటేనే సావిత్రిబాయి పూలే అని, నాడు సమాజంలో ఉన్న అనేక సాంప్రదాయాలను ఎదిరించి బాలికలకు విద్యను అందించడం కోసం జీవితాంతం కృషి చేసిన సావిత్రిబాయి పూలేను నేటి యువతీ యువకులు స్మరించుకోవాలని, ఆమె ఆశలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డివిజన్ కార్యదర్శి కడారి శివ, నాయకులు సాయి భరత్, సాయి శివ ,ప్రభాస్, రవితేజ, మనిషా, రవళి ,కీర్తన విద్యార్థిని, విద్యార్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.