– అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ స్మారకోపన్యాసంలో ఆచార్య స్వరూపారాణి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే జీవితం నేటి సమాజానికి ఎంతో ఆదర్శమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య చల్లపల్లి స్వరూపారాణి అన్నారు. సావిత్రిబాయి ఫూలే 193వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ)లో సోమవారం ‘సామాజిక న్యాయం కోసం సావిత్రిబాయి ఫూలే పోరాటం’ అనే అంశంపై స్మారకోపన్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం పురుషుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారని చెప్పారు. ఆధిపత్య వర్గాల నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారనీ, బ్రాహ్మణ సమాజ మహిళలు ఎదుర్కొన్న సమస్యలను కూడా ప్రశ్నిస్తూ ఆ వర్గాల మహిళల హక్కుల రక్షణకు పాటు పడ్డారని అన్నారు. శిశు హత్యా నిరోధక గృహాలను ఏర్పాటు చేశారనీ, మాతా శిశు మరణాల నిరోధానికి కృషి చేశారని వివరించారు. సమాజం ఎదిరించినా తన భర్త జ్యోతిరావు ఫూలే అంత్యక్రియలు తానే నిర్వహించి ఆదర్శ మహిళగా నిలిచారని చెప్పారు. సావిత్రిబాయి ఫూలే జీవితం, ఆదర్శ భావాలు భవిష్యత్ తరాలకు అవసరమనీ, విశ్వవిద్యాలయాల్లో ఆమె జీవితంపై మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బీఆర్‌ఏఓయూ ఉపకులపతి కె సీతారామారావు మాట్లాడుతూ ఆదర్శ భావాలు కలిగిన సావిత్రిబాయి ఫూలే సమ సమాజ స్థాపనకు కృషి చేశారని అన్నారు. మహిళా సాధికారత, వారికి విద్యాభ్యాసం, పాఠశాలల ఏర్పాటు, ఒక ఆదర్శ ఉపాధ్యాయురాలుగా ఆమె చేసిన కృషిని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అకడమిక్ డైరెక్టర్ ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ఏవీఎన్ రెడ్డి, విశ్వవిద్యాలయ మహిళాభివృద్ధి సంస్థ ఇన్‌చార్జి మేరీ సునంద తదితరులు ప్రసంగించారు. సీఎస్‌టీడీ డైరెక్టర్ ఐ ఆనంద్ పవర్, ఈఎంఆర్‌సీ డైరెక్టర్ వడ్డాణం శ్రీనివాస్, ఎడ్యుకేషన్ విభాగ డీన్ చంద్రకళ, లైబ్రరీ ఇన్‌చార్జి ఎన్ రజని తదితరులు పాల్గొన్నారు.