‘తత్వవేత్తలు ప్రపంచాన్ని పరిపరి విధాలుగా విశ్లేషించారు, వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు చేయాల్సింది దాన్ని మార్చడమే’ అంటారు కార్ల్‌మార్క్స్. ఆ మహనీయుడు ప్రబోధించిన ప్రకారం ఆ కషిని ఆకాలంలోనే ఆచరించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే.త్యాగం, సేవ, క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరుగా నిలిచిన భారతీయ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయిని. ‘శూద్రులు, అస్పశ్యులు చదివితే నాలుకలు కోయాలి. పాఠాలు వింటే చెవుల్లో సీసం పోయాలి’ అనే మానసిక చట్టాలను మట్టిలో పాతిపెట్టిన సామాజిక విప్లవ మాత మూర్తి. మనువాద సిద్ధాంతం ప్రకారం కేవలం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలకు మాత్రమే నాడు చదువుంది. ఆ మను వాదుల విషమ షరతులను తన కాలిగోటికి కట్టేసి అనేక అవమానాలను, ఛీత్కారాలను భరించి చదువు నేర్పిన ధీరవనిత.శూద్రులు విద్య నేర్చుకోవడం సహజమైన హక్కని, అందరూ చదవాలి.. అందరూ అసమానతలు లేకుండా బతకాలని పరితపించిన స్ఫూర్తిప్రదాత. ఆమె ఓ గొప్ప ఉద్యమకారిణి, రచయిత్రి, మంచివక్త, కులంపై కలంతో యుద్ధం నడిపిన కవయిత్రి.
1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగామ్ అనే గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆమె పరిస్థితుల ప్రభావం రీత్యా తొమ్మిదేళ్ల వయసులోని జ్యోతిబాపూలేని వివాహమాడింది. నిరక్షరాస్యులైన సావిత్రికి తన భర్తనే మొదటి గురువుగా విద్యా జ్ఞానం నేర్పి సామాజిక ఉద్యమకారిణిగా తీర్చిదిద్దాడు.1847 నాటికి ఆమె భర్తతో కలిసి శుద్ర కులాల బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను నెలకొల్పారు. న్యాయం, ప్రజాస్వామ్యం, సమానత్వం అనే ఆదర్శాలు సావిత్రిబాయి జీవితంలో సహజ గుణాలుగా నిలిచిపోయాయి. స్త్రీ, పురుష సమానత్వం కోసం సాగిన ఉద్యమాల్లో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. కులం, పురుషాధిక్య, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక మహిళ ఉద్యమకారిణి ఆమె. బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉన్న ఉద్యమాలకు ప్రత్యామ్నాయంగా సాగిన పోరాటాల్లో ఆమె పీడితుల పక్షాల అగ్రగామిగా నిలిచారు. 1852లో మహిళా సేవ మండలి పేరిట మహిళా సంఘాన్ని స్థాపించారు.వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు. అనాధ బాలలు, శూద్ర బాలికలందరూ తన బిడ్డలని అక్కున చేర్చుకున్నారు.1874లో ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన బిడ్డను పూలే దంపతులు దత్తత తీసుకుని యశ్వంత్ అని పేరుపెట్టి పెంచి పెద్దచేసి డాక్టర్ చదివించారు.
1873లో సత్యశోధక్ సమాజ్ మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు చేపట్టారు. భార్యను కోల్పోయిన యువకుడిని చేరదీసి తన స్నేహితురాలి బిడ్డతో మాట్లాడి పురోహితులు, పైసా ఖర్చు లేకుండా దండలు మార్చి పెండ్లి చేశారు. ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటి ఆదర్శ వివాహం. అదేవిధంగా ఒక పేద వ్యక్తి ఇంట్లో పూలే బాలికల పాఠశాలను ప్రారంభించగా సావిత్రిబాయి తన స్నేహితురాలు ఫాతిమా షేక్‌తో కలిసి ఆ పాఠశాలను చాలా సమర్థవంతంగా నడిపారు. కానీ, బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులు కక్ష గట్టి శూద్రులు అందులో మహిళలు చదవడం అపచారం..అపచారం అంటూ అనేక ఆటంకాలు సష్టించారు. ఆమె పాఠశాలకు వెళ్లే దారిలో అటకాయించి రాళ్లు విసిరేవాళ్లు. వేధింపులకు గురి చేయడమే కాక నానా బూతులు తిట్టేవారు. బురదను చల్లేవారు. అయినప్పటికీ తన లక్ష్యం కోసం ఓ పాత చీర పెట్టుకునిపోయి చదువు నేర్పారు సావిత్రిభాయి. 1890 నవంబర్ 28న జ్యోతిబాపూలే మరణించారు.సావిత్రిబాయి తన భర్త చితికి నిప్పంటించారు. అనంతరం సత్య శోధక్ సమాజం బాధ్యతలను ఆమె స్వయంగా నిర్వహించారు. 1896లో మహారాష్ట్రలో సంభవించిన తీవ్ర కరువు ప్లేగువ్యాధి అక్కడి జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఆమె దళితులు, పేదల కోసం జోలపట్టి విరాళాలు సేకరించి వారికి అందించారు. ప్రభు త్వంతో పోరాడి బాధితుల కోసం నిధులు మంజూరు చేయించారు. ప్లేగువ్యాధి ప్రబలిన బాధితులకు ప్రత్యక్షంగా సేవలందిస్తూ ఆ సమయంలో ఆమె కూడా అదే వ్యాధికి గురై చివరకు 1897 మార్చి 10న కన్నుమూశారు.
సావిత్రిబాయి బతికినంతకాలం అందరికీ విద్యా వైద్యం, సమాన అవకాశాల కోసం తన జీవితాన్ని ధారబోశారు. ప్రకతి వనరులు ప్రజలందరికీ అందాలని కోరుకున్నారు. కానీ, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు ఆమె ఆశయాలకు విరుద్ధంగా విద్యను సంతలో సరుకుల్లా అమ్ముకుం టున్నారు. అందుకు మోడీ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానమే సజీవ సాక్ష్యం. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా డబ్బున్న కొందరికి ఉన్నత విద్యను కట్టబెట్టడం, ఇందులో అణగారిన పేదలకు చదువులు అందకుండా చేసే కుట్ర దాగుంది. యూనివర్సిటీలను కూడా ప్రయివేటుపరం చేయడం, పాఠ్యాంశాల్లోనూ మూఢాచారాలను జొప్పించడం, విద్యార్థులపై అశాస్త్రీయ భావజాలన్ని రుద్దడం శరవేగంగా అమలు చేస్తున్నారు. అలాగే దేశ సమైక్యత, సమగ్రతలకు భంగం కలిగిస్తూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతప్తిని ఒక క్రమపద్ధతిలో పక్కదోవ పట్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నిరుద్యోగం, ఉపాధి, వ్యవసాయ సంక్షోభం, కార్మి కులకు కనీస వేతనాలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం వంటి అనేక సమస్యల నుండి ప్రజల దష్టిని మరల్చుతున్నారు. ఇప్పుడు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ పేరు తో ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగ పునా దులను దెబ్బతీస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు రాయితీ లిస్తూ పేద ప్రజలపై పన్నుల భారం మోపు తున్నారు.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విద్యా, వైద్యం ప్రభుత్వ సంక్షేమ రంగంలోనే ఉండాలని చెప్పారు. భారతీయు లందరికీ సమాన ఉన్నత విద్య అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. కానీ నేడు దేశాన్ని కార్పొరేట్ శక్తులు ఏలుతున్నాయి. ప్రజలెన్నుకున్న పాలకులే వారికి మేలు చేసే చట్టాలు తీసుకొస్తున్నాయి. అందుకే సావిత్రిభాయి పూలే స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రతిఘటిం చాలి. ప్రజల్ని చైతన్యపరచాలి. సావిత్రిబాయి పూలే జయంతి, వర్ధంతి సందర్భంగా ఆమె ఫొటోకు దండ వేసి ఆమె ఆశయాలను అంతం చేసే ఏలికలున్న సమాజం మనది. కాషాయపు కుట్రల్ని తిప్పికొట్టాలి. అందుకుగాను సావిత్రిభాయిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి.
(నేడు సావిత్రిభాయి ఫూలే జయంతి)
టి. స్కైలాబ్‌బాబు 9177549646