సావుకాడ

ఒక ఇంట్లో నుంచి ఏడుపు వినబడుతుంది. ఏంటిదా అని అందరూ వెళ్లారు. ఒక ఆమె ఏడుస్తుంది. ఆమెని చూసి పక్కనే పిల్లలు కూడా ఏడుస్తున్నారు. ఏమైంది అని చూస్తే ఆమె భర్త (పిల్లల నాన్న) నిదల్రోనే చనిపోయాడు. ఆ పిల్లలకు అక్కడ ఏం అయ్యిందో తెలిసేంత వయసు కూడా లేదు. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగాడు.
ఇంతలో విషయం అందరికి తెలిసింది. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరి దగ్గరనో అంతకు ముందు ఎప్పుడో అప్పు తీసుకున్నాడు. ఇప్పడు ఈ విషయం తెలిసి ఆ అప్పులోళ్లు వచ్చి అతని భార్యని పైసలు అడుగుతున్నారు.
”ఏం అమ్మా నీ మొగుడు నాకాడ పైసలు అప్పు తీసుకున్నడు ఇస్తావా లేదా?” అని అందరి ముందు గట్టిగా అరిచాడు.
ఆమె ”నాకు పైసలిషియం ఏం చెప్పడయ్యా. ఏ అప్పుల గురించి నాకేం తెల్వదు” అని నిస్సహాయంగా అంది.
అక్కడకి వచ్చిన ఒక పెద్దమనిషి ”ఏందయ్యా ఆమెకేం తెల్వదంట గిట్లోచి అడిగితెట్ల” అన్నాడు.
అప్పులోడు ”గట్లనా” అనుకుంటూ తన దగ్గర ఉన్న ప్రాంసరినోటు తీసి ”ఇగో సదువు. ఇది గీన పేరేకదా. ఇగో వాని సంతకమే. గావలంటేవాని పెళ్ళాంని అడుగు” అని చూపించాడు. ఆ పెద్ద మనిషి ిప్రాంసరినోటు చూసి ఆమెకు చూపించి ”గీ సంతకం నీ మొగునిదేనా తల్లి” అని ఆమె వైపు తిరిగి అన్నాడు.
ఆమె చూసి ”అవును నా మొగునిదే” అంది.
అప్పులోడు ఆ పెద్దమనిషి దిక్కు చూసి ి”సల్లవడ్డవా పక్కకి జరుగు” అన్నాడు. అలా అనగానే ఆ పెద్దమనిషి ఏమీ అనలేక ఉండిపోయాడు. ఆమెని చూసి అప్పులోడు ”పైసలు ఇస్తావా లేదా గిప్పుడు” అన్నాడు.
ఆ పక్కనున్న పెద్దమనిషి ”కార్యం అయితే కానియ్యి. అయినంక ఎట్లన్నన్న జేస్తదిగని” అన్నాడు.
అప్పులోడు ”ఆమె కట్టకపోతే నువ్వు కడతా అని సంతకం చెయ్యి ఇడిసిపెడతా” అని ఆ పెద్దమనిషిని సూటిగా చూశాడు.
ఆ పెద్దమనిషి భార్య ”నువ్వూకో మనకెందుకొచ్చింది” అంది.
అప్పులోడు ”పైసలు అనంగనే నోరు లేస్తలేదు” అని ఆమె దిక్కు తిరిగి ”నువ్వేమన్న చేసుకో.. నాకు పైసలు కావాలి” అని గట్టిగట్టిగా అరుస్తున్నాడు. ఆమె వణికిపోతోంది. పిల్లలకు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక వాళ్ళు కూడా ఏడుస్తున్నారు.
ఆమె ”ఇప్పటికిప్పుడు పైసలు యేడికెళ్ళి దెస్తనన్న” అంది.
అప్పులోడు ”నీ మొగుడే సచ్చినంక నీ మెడలున్న పుస్తెలతాడుతోని ఏం పేచీ. ఇక్కడియ్యు” అన్నాడు.
అప్పులోడి మాటలకు ఆమె నిర్ఘాంతపోయి చూసింది. అక్కడ చాలామంది ఉన్నారు. అందరూ అలాగే చూస్తూ ఉన్నారు కానీ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. డబ్బుల విషయం కదా… ఆమెకి ఏం చేయాలో తెలియక ఏడుస్తూ మెడలోని పుస్తెల తాడుని తీసి ఇచ్చింది. అప్పులోడు ఇంత కూడా జాలి లేకుండా అలాగే తీసుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.
ఇంతలో ఆ ఇంటిఓనరు వచ్చాడు. అతనికి అలాంటివి చాలా ఇల్లు ఉన్నాయి వాటిల్లో ఇది కూడా ఒకటి. ఓనర్‌ ”నా ఇంటిముందుకెళ్లి శవం తీయుండి” అన్నాడు
ఆ పక్కనున్న గుంపులోంచి ఒక ఆడమనిషి ”ఇంకేడ ఎయ్యుమంటవ్‌” అంటే…
ఓనర్‌ కోపంగా ”ఏడనన్న యేసుకొని. నా ఇంట్ల సావు చేయనికే కట్టిన్నా ఇల్లు. నా ఇంటికి మంచిదికాదు తీసేరు” అన్నాడు.
ఇంకొకరు ”గట్ల మాట్లాడుతావ్‌ ఎందన్న. ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఏడికి పోతది” అన్నరు.
ఓనర్‌ ”ఎడనన్న వడని. రోడ్డుమీన యేసుకోమను నాకేంది” అని తన వెంట వచ్చిన వాళ్ళను ఇంట్లోకెళ్లి శవాన్ని తీయమని సైగ చేశాడు.
సావిత్రి ఎంత బతిమిలాడినా వినలేదు. ఆఖరికి కాళ్ళు పట్టుకున్నా కరగలేదు. బలవంతంగా రోడ్డు మీద వేశారు. అక్కడున్న వాళ్ళందరూ ”అయ్యో పాపం ఎంత పనయ్యింది” అనుకున్నరు.
కొద్దిసేపటికి అక్కడున్న పెద్దమనిషి కార్యం జరపాలి కదా అని సావిత్రి దగ్గరకు వచ్చి ”తల్లీ కట్టెబట్టకు పోవాలే నీ వాళ్లెవారైనా ఉంటే చెప్పమ్మా కార్యం జరిపియ్యాలి కదా” అన్నడు.
”మా వాళ్ళంటూ ఎవరూ లేరు” అంది సావిత్రి.
పక్కనున్న ఒక ఆడ మనిషి సావిత్రి దగ్గరకు వచ్చి ”ఏమ్మా నీకు ఎవరు లేరా గట్లా” అంటే, సావిత్రి వస్తున్న దు:ఖాన్ని ఆపుకొని ”మాకు ఎవరూ లేరు. మేం అనాథలం” అంది.
పెద్దాయన ”మరి కట్టెబట్టకు పైసలు ఎట్లబిడ్డా” అన్నడు.
సావిత్రి తన కూతురు చెవికి ఉన్న బంగారు కమ్మలు తీసి ఇచ్చింది.
ఆ చిన్నపిల్ల ”అమ్మా అవి నా కమ్మలే నాయిన కొనిచ్చిండు” అని ఏడ్చింది. అయినా సావిత్రి ఏడుస్తూ ఇచ్చేసింది.
అక్కడున్న పెద్దమనిషి ”ఒరేరు ఎల్లిగా ఇట్లరా ఇగో ఇవి తీసుకొని కట్టెబట్ట తీస్కరాపో” అని అతని చేతిలో పెట్టిండు. వాళ్ళు వెళ్తారు.
ఇంతలో డప్పు కొట్టేవాళ్ళు వచ్చారు. వచ్చి పెద్దమనిషి దగ్గరకు పోయి ”ఏం అన్నో నాల్క తడుపుకొని వొస్తాం పైసలు ఇప్పియ్యు” అంటే అతను వాళ్ళ దిక్కు చూసి ”ఆ బిడ్డకాడ పైసలు లేవు తమ్మి” అనగానే ఆ డప్పులోడు ”పైసలు లేకపోతే పనెట్ల అయితది. ఐదు మందిమి ఒచ్చినం. మనిషికి వెయ్యు లెక్కన ఐదువేలు గావలే” అంటే సావిత్రి వాళ్ళ దిక్కు చూసి నిస్సహాయతతో ”నా దగ్గర పైసలు లేవు” అంది.
వచ్చిన వాళ్ళు ”పైసలు లేకపోతే ఏ కార్యం కాదమ్మ అదిసావైనా! బతుకైనా!” అని పక్కన వాళ్లతో ”మనకీడ పైసలు ముట్టేటట్టు లేవు పాండ్రా పోదాం” అని అనుకుంటూ వెనక్కి తిరిగివెళ్ళి పోయారు.
కొద్దీసేపటికి బొంద తొవ్వే వాళ్ళొచ్చారు. ఎనిమిదివేలు ఇస్తే మా పని మేం చేస్తాం అన్నారు.
సావిత్రి నా దగ్గర పైసలు లేవు అనగానే పని కాదు అన్నారు.
సావిత్రి ”మీ కాళ్ళు పట్టుకుంటా అన్న” అంది.
బొంద తవ్వే వాళ్లలో ఒకడు ”నువ్వు కాళ్ళు పట్టుకున్నవని మేం పుణ్యానికి చేస్తే రేపు అందరూ అట్లనే చేస్తరు” అని కరుణ లేకుండా అనేశాడు. సావిత్రి ఏమి చేయలేక ఊరుకుంది.
కట్టెబట్టకు పోయిన వాళ్ళు అవి తీసుకొని తిరిగివస్తారు. వాళ్ళు రాగానే పాడేకట్టేపని మీద పడ్డరు. ఆ పెద్దమనిషి కొత్త బట్టలు తీసుకొని శవానికి స్నానం చేయించాడు. సావిత్రికి పసుపు పెట్టి నీళ్లు పోశారు. వాళ్ళ తడిసిన బట్టలు తీయడానికి బట్టలు ఉతికేవాళ్ళు వచ్చారు.
వాళ్ళు కూడా ముందు పైసలు ఆ తరువాతే బట్టలు ముట్టుకుంటాం అన్నారు. సావిత్రి దగ్గర పైసలు లేవని అక్కడినుంచి ఆ బట్టలు ముట్టుకోకుండానే ఉండిపోయారు. సావిత్రే స్వయంగా ఆ బట్టలు తీసివేయడానికి వెళ్తుంటే నువ్వు ముట్టుకోవద్దు బిడ్డా అని అందరూ అన్నారు.
”నేను ముట్టుకోకపోతే వాళ్ళు పైసలు అంటారు. నాకాడ పైసలు ఎక్కడ ఉన్నారు” అంది సావిత్రి. ఇంతలో ఇద్దరు పిల్లలు ఇంట్లోకెళ్లి వాళ్ళు పైసలు దాచుకున్న గల్లగురిగి తీసుకొని వచ్చి వాళ్ళమ్మ ముందు పగులగొట్టి ”ఇగో అమ్మా… పైసలు తీసుకోమను” అని చెప్పారు.
సావిత్రికి దు:ఖం ఆగలేదు. వాళ్ళని పట్టుకొని బోరుమంది.
పాడేమీద శవాన్ని పడుకోబెట్టారు.
”బొంద తొవ్వలే. కట్టెలకు పైసలు లేవు. ఎట్లా చేద్దామమ్మా” అన్నాడు పెద్దమనిషి .
సావిత్రి ”స్మశానం కాడికి సాయం పట్టుండి” అంటే ఒక నలుగురు కలిసి ఆ పాడెను స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ సావిత్రి తనే గడ్డపార, పలుగు తీసుకొని తనే తవ్వడం మొదలు పెట్టింది.
ఇంతలో ఒకతను సాయం చెయ్యడానికి వెళ్లాడు.
బొంద తొవ్వేవాళ్ళు ” మీరెవరన్న సాయం చేస్తే రేపు మీ ఇంట్ల ఏ కార్యం అయిన మా కులపోళ్లు ఎవ్వరూ రారు గుర్తుపెట్టుకోండి” అన్నారు.
ఇక ఎవ్వరూ సాయం జేయడానికి ముందుకు రాలేదు.
సావిత్రి పిల్లలను ఒక చెట్టు కింద కూర్చోపెట్టి తనే తవ్వుతుంది. అక్కడున్న వాళ్ళు అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు.
పాపం పైస్లు లేవు అని కొందరంటే, కొంతమందయితే కన్నీళ్లు పెట్టుకున్నారు. బొంద సగం తవ్వడం అవ్వగానే ఉరుములు, మెరుపులతో వర్షం పడడం మొదలయింది.
వానకు తవ్విన మట్టి, మళ్ళీ బొందలోకి జారుతుంది. బొందలో నిలబడి సావిత్రి ఆకాశాన్ని చూస్తూ ఏడుస్తూ కోపంతో ”దేవుడా నీకు జర్రంతా అయినా సిగ్గుంటే గిట్లచేయవ్‌ తూ” అని మళ్లీ తవ్వుతూనే వుంది.
”ఏం పాపం చేసినా దేవుడా… నాకు బతికుండగానే నరకం జూపిస్తున్నవు” అనుకుంటూ బొందలోని నీటిని బయటకు తోడేస్తూ తొవ్వుతోంది.
తొవ్వడం అయినాక, బొంద పక్కన ఉన్న తన భర్త శవాన్ని పట్టుకొని బోరున ఏడ్చింది. చివరిసారిగా భర్తను కల్లారా చూసుకుంది. ఇద్దరి సాయంతో శవాన్ని బొందలోకి దింపింది.
మళ్లీ సావిత్రే ఆ బొందని పూడ్చింది. వర్షం ఆగిపోయింది. బొంద మీద పడి సావిత్రి కరువుతీరరా ఏడ్చింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఆమె పడుతున్న బాధను అలాగే చూస్తూ ఉండిపోయారు.
సావిత్రి ఇద్దరు పిల్లలు ఆమెపక్కన చేరివాళ్ళ అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలియక వాళ్లు కూడా ఏడుస్తూ కూర్చున్నారు.
సావిత్రి కూతురు ”అమ్మా… నాన్న ఎందుకే లోపల పడుకున్నడు. నువ్వెందుకే ఏడుస్తున్నవు” అంది.
అంతే… బిడ్డను గట్టిగా హత్తుకొని ఇంకా గట్టిగా ఏడ్చింది.
కొడుకు వచ్చి తల్లి కన్నీళ్లు తుడ్చాడు. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.
అందరూ మెల్లిగా ఇంటిదారి పట్టారు. సావిత్రిని ఎవరో తీసుకొద్దాం అనుకుంటే ఆమె రానంది.
వాళ్లు కూడా అడిగిఅడిగి అలాగేవెళ్ళి పోయారు.
భర్తచనిపోతే కనీసం కార్యం కూడా సరిగ్గా చేయలేకపోయినా అని ఏడుస్తుంది సావిత్రి. అలాగే బొంద మీద పడుకుంది. పిల్లలు కూడా ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాళ్ళ అమ్మతో పాటు అలాగే ఆ స్మశానంలోనే ఉండిపోయారు.
పొద్దుపొద్దున పిల్లలు లేచి, వాళ్ళ అమ్మని లేపడానికి పయ్రత్నించారు. వాళ్ళమ్మ లేవలేదు. పిల్లలు ఏడుస్తున్నారు.
ఇంతలో పక్కనుంచి నీళ్లు ఇప్పడానికి వెళ్తున్న మనిషి చూసి వాళ్ళ దగ్గరకు వచ్చాడు.
”ఏమైంది బేటా” అని అడిగాడు.
”మా అమ్మ లేస్తలేదు” అన్నారు పిల్లలు.
అతను సావిత్రిని లేపడానికి పక్కకి జరిపాడు. అప్పటికే ఆమె చనిపోయింది.
ఆ వ్యక్తి పిల్లలతో ”మీ అమ్మ కూడా సచ్చిపోయింది” అని చెప్పాడు.
పిల్లలిద్దరు ”సచ్చిపోవుడు అంటే ఏంది” అని అడిగారు.
ఈ ప్రశ్నకి ఆ వ్యక్తి కంట్లో నీళ్లు తిరిగాయి.
పిల్లలిద్దరూ వాళ్ళమ్మని లేపడానికి ప్రయత్నిస్తూ… ”అమ్మా.. లేమ్మా ఇంటికిపోదాం” అన్నారు.
వాళ్ళమ్మ లేవలేదు. ఇద్దరు పిల్లలు అలా ఏడుస్తూనే వున్నారు. తరువాత ఆ పిల్లలు ఏమయ్యారో!

– అసుర