– తగ్గిన మొండి బాకీలు
– క్యూ3 లాభాల్లో 84 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అత్యంత ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 84.32 శాతం వృద్ధితో రూ.16,891.44 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9,164 కోట్ల లాభాలు ఆర్జించింది. అదే సమయంలో రూ.39,816 కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం.. గడిచిన క్యూ3లో 4.09 శాతం పెరిగి రూ.41,620 కోట్లకు చేరింది. 2024 డిసెంబర్ ముగింపు నాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు35 బేస్‌స్ పాయింట్లు మెరుగుపడి 2.07 శాతానికి పరిమితమయ్యాయి. నికర నిరర్ధక ఆస్తులు 11 బేసిస్ పాయింట్లు మెరుగుపడి 0.64 శాతం నుంచి 0.53 శాతానికి పరిమితమయ్యాయి. గడిచిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.911 కోట్లు కేటాయించింది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలం నాటి రూ.688 కోట్లతో పోల్చితే కేటాయింపులు పెరిగాయి. బ్యాంక్ మొత్తం ఆదాయం 8.69 శాతం వృద్ధితో రూ.1,28,467 కోట్లకు చేరింది. 2023-24 ఇదే త్రైమాసికంలో రూ.1,18,192.68 కోట్ల ఆదాయం ఆర్జించింది.
రుణాలు రూ.40 లక్షల కోట్లు
గడిచిన క్యూ3లో రుణాల జారీలో ఎస్‌బిఐ 13.49 శాతం వృద్ధిని సాధించింది. దీంతో స్థూల రుణాల విలువ రూ.40 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించాయి. ఎస్‌ఎంఈ రుణాల జారీ 18.71 శాతం, వ్యవసాయ రుణాలు 15.31 శాతం, కార్పొరేటల్ రుణాలు 14.86 శాతం, రిటైల్ రుణాల్లో 11.65 శాతం చొప్పున పెరుగుదల నమోదయ్యింది. బ్యాంక్ డిపాజిట్లు 9.81 శాతం పెరిగాయి. అన్‌సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాల జారీలో రెండంకెల వృద్ధి చోటు చేసుకుందని ఎస్బీఐ చైర్మెన్ సిఎస్ శెట్టి పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్ వ్యాపారం పోర్టుపోలియో రూ.10,000 కోట్ల నుంచి రూ.11,000 కోట్లకు మాత్రమే చేరిందన్నారు. ఈ పరిశ్రమలో కొంత ఒత్తిడి నెలకొందన్నారు.